నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది...కన్నుల్లో నీరు తుడిచి కమ్మటి కల ఇచ్చింది..

Tuesday, August 26, 2014

హైడ్ అండ్ సీక్ !





ఒక్కటంటే ఒక్క మాట కూడా
బయటకు రాకుండా
పెదవి దగ్గర ఆనకట్ట వేసేసి
ఎన్ని దాస్తుందో ఈ మనస్సు!


ఆ అక్షరాలను చూస్తే
ఎన్ని అబద్ధాలు గుర్తుకొస్తున్నాయో !

ఆ అక్షరాలూ చూస్తే
ఎన్ని నయవంచనలు తెలిసి వస్తున్నాయో !

ఆ అక్షరాలూ చూస్తే
ఎన్ని దాపరికాలు తెలిసి పోతున్నాయో

నాలుగు అడుగులు కలిసి వేస్తున్నప్పుడు
ఒక్కో ముద్దా నోట్లో పెట్టుకుంటున్నప్పుడు
పక్క మీద దుప్పటి  కళ్ళ మీదకు లాక్కుంటున్నప్పుడు  
కళ్ళ గంతలు విప్పుతూ
ఒక విభజన నగ్నం గా నిలబడుతుంది 

ఏళ్ల తరబడి చేసిన సహజీవనం
ఒట్టి  దొంగ కాపురం
 నీకూ నాకూ మధ్య మిగిలింది
కొన్ని విఫల స్వప్నాలు మాత్రమే !


ప్రేమ లాగే ద్వేషం  కూడా
దాచాలనుకుంటే దాచలేము
కావాలనుకుంటే పొందలేము
వద్దనుకొని విదిలించుకోలేము

ఆకాశాన్ని రెక్కలుగా కత్తిరించినా
భూమి ని రెండు ముక్కలుగా విడగొట్టినా
ప్రేమ పేరుతో ఈ ద్వేషాన్ని
శవం చుట్టూ మోసే కుండ లా
జీవితాంతం  మోస్తూ తిరగాల్సిందే !


కల్పనారెంటాల


( ఆగస్ట్ 26, 2014 )





 
Real Time Web Analytics