నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది...కన్నుల్లో నీరు తుడిచి కమ్మటి కల ఇచ్చింది..

Tuesday, December 06, 2011

వ్యవస్థ వికృత రూపాన్ని బట్ట బయలు చేసిన క్లాసిక్ రష్యన్ నవల “ యమకూపం”


వందేళ్ల నాటి జెన్నీ...నేటి నళిని....

నళినీ జమీలా అనే సెక్స్ వర్కర్ ఇటీవల తన ఆత్మకథ రాశారు. పుస్తకాన్ని ఇంగ్లీష్ నుండి అనువదిస్తున్న రోజుల్లో, కొన్ని వాక్యాల దగ్గర హఠాత్తుగా ఆగిపోతుండేదాన్ని. నళిని చెప్పిన అవే అనుభవాలు, అవే పరిశీలనలు గతంలో ఎక్కడో చదివానని అనిపించేది. కుప్రిన్ 'యమా పిట్'కు రెంటాల గోపాలకృష్ణ అనువాదం 'యమకూపం' చాలా కాలం తర్వాత ఇప్పుడు మళ్లీ చదువుతుంటే, పోలికలు ఎక్కడివో స్పష్టపడింది. నళిని జీవితంలోని ప్రతి అనుభవానికీ ప్రతీక లనదగిన ఎందరో స్త్రీలు నవలలో ఎదురవుతారు. వందేళ్ల క్రితమే వాళ్లు పలికిన మాటలన్నీ నళిని గొంతులో ప్రతిధ్వనించాయి. మరీ ముఖ్యంగా, కుప్రిన్ సృష్టించిన జెన్నీ మరీ మరీ గుర్తొస్తుంది నళినిని చదువుతుంటే!”

కొందరి స్త్రీల జీవితాల్లో ఎలాంటి మార్పులు రాకుండా...
వందేళ్ళ నాటి ప్రశ్నలు ఇప్పటికీ సజీవంగా నిలిచి ఉన్నాయి ఎలాంటి సమాధానాలు లేకుండా...
యమకూపం పుస్తకం కోసం సమకాలీన సందర్భాన్ని వివరిస్తూ కాత్యాయని రాసిన ముందు మాట ని ఇక్కడ చదవండి.

అలెక్జాందర్ కుప్రిన్ రాసిన రష్యన్ క్లాసిక్ నవల “ యమా ది పిట్” కి తెలుగు అనువాదం “ యమకూపం” ను సారంగ బుక్స్ వారు ఆన్ కోర్ సిరీస్ లో తొలి పుస్తకంగా నూతన సంవత్సర కానుకగా సాహితీ ప్రియులకు అందిస్తున్నారు. ప్రముఖ పుస్తకాల షాపులన్నింటి లో ఈ పుస్తకం దొరుకుతుంది. ఈ పుస్తకానికి మధురాంతకం నరేంద్ర, కాత్యాయని రాసిన ముందుమాటలు విశ్వ సాహిత్యం లో ఈ పుస్తకానికి వున్న విలువైన స్థానాన్ని, సమకాలీన సందర్భాన్ని కూడా తెలియచేస్తాయి. అర్థ శతాబ్దం గా ఈ పుస్తకం తెలుగు సాహిత్యం లో తనదైన విశిష్ట స్థానాన్ని నిలుపుకుంది. ఈ తాజా ముద్రణ ను కూడా సారంగ ఇతర ప్రచురణల్లాగా ఆదరిస్తారని ఆశిస్తున్నాము.

1 వ్యాఖ్యలు:

Praveen Mandangi said...

నళిని జమీలా విషయం కొంచెం వేరు. ఆమె ఆ వృత్తి నుంచి బయటకి రాకుండా కొందరు వేశ్యావృత్తి ప్రోత్సాహకులు ఆమెని బ్రెయిన్‌వాష్ చేశారు. ఆ వృత్తి నుంచి బయటకి రావాలనుకున్నా రాలేనివాళ్ళే ఎక్కువ.

 
Real Time Web Analytics