నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది...కన్నుల్లో నీరు తుడిచి కమ్మటి కల ఇచ్చింది..

Thursday, September 30, 2010

టెక్సాస్ " గుడివాడ" లో సాహిత్య సందడి- పాటల పందిరి!

మా ఆస్టిన్ కి దగ్గర్లో టెంపుల్ అనే చిన్న వూరు, అందులో ఒక మంచి గణపతి ఆలయం వున్నాయి. దానికి మా మందపాటి సత్యం గారు అనుకుంటాను " గుడి వాడ" అని నామకరణం చేశారు. సత్యం గారి థియరీ ప్రకారం మా ఆస్టిన్ హస్తినాపురం, సత్యం గారు వుండే ఫ్లూగర్ విల్ బలరామ పురం. ప్లూగర్ అంటే నాగలి కాబట్టి ఆయన ఈ పేరు పెట్టారు. కాబట్టి మా తెలుగు సాహిత్య సదస్సు ల్లో మా వూర్లను ఈ ముద్దు పేర్లతోనే పిలుచుకొని ఆనందిస్తుంటాము

.వై. వి రావు గారి ఆధ్వర్యం లో “ గుడివాడ" లో 25 వ టెక్సాస్ తెలుగు రజతోత్సవ సాహిత్య సదస్సు సెప్టెంబర్ 25 వ తేదీ చాలా చక్కగా జరిగింది. ఈ టపా ఆ సదస్సు లో కొన్ని విశేషాల గురించి...

సదస్సు ఉదయం 10 గంటల నుండి సాయంత్రం అయిదున్నర వరకూ జరిగింది. ఒక అరగంట విరామం తర్వాత వంగూరి ఫౌండేషన్ , వేగేశ ఫౌండేషన్ వారి ఆధ్వర్యం లో మూడున్నర గంటల పాటు ఘంటసాల ఆరాధనోత్సవాలు వీనుల విందుగా జరిగాయి.

ఆటా, తానా లాంటి జాతర్లలో కాదు కానీ విడిగా ఏ వూర్లోనైనా సాహిత్య సదస్సు జరిగితే ప్రేక్షకుల సంఖ్య ఆంధ్రాలో జరిగే సాహిత్య సమావేశాల కన్నా ఎక్కువగా వుంటుంది. చాలా ఆసక్తికరంగా కూడా జరుగుతాయి. ఈ సారి ఈ గుడివాడ రజతోత్సవ సదస్సు మామూలు వాటికంటే ఇంకా బాగా జరిగింది. డాలస్, శాన్ ఆంటోనియో, ఆస్టిన్, హ్యూస్టన్, టెంపుల్ నుంచిమొత్తం వందమందికి పైగా ఈ సదస్సు లో పాల్గొన్నారు. మేము ఒక అరగంట ఆలస్యం గా వెళ్ళటం తో ఠంచన్ గా మొదలైన సదస్సు లో మొదట్లో కొన్ని కార్యక్రమాలు మిస్ అయ్యాము.

మేం వెళ్ళేసరికి మా హాస్య చిట్టెలుక చిట్టెన్ రాజు గారు ప్రసంగం చివర్లో వుంది. ఆయన రచనలు ఎంత బాగా నవ్విస్తాయో, ఆయన ప్రసంగాలు కూడా అంతకన్నా ఎక్కువ హాస్య చతురత తో నిండి వుంటాయి. ప్రసంగాల్లో ఎక్కువ భాగం హాస్యం గానూ, సరదాగానూ వుండటం తో ఒక రోజంతా జరిగినా కూడా ఎక్కడా బోర్ కొట్టలేదు.

గుడివాడ గిరీశం ఫేమ్ గిరిజా శంకర్ గారి గిరీశం లెక్చర్లు , ఆయన రాసిన హైదరాబాద్ తో హ్యూస్టన్ బై త్రిశంకు ఎయిర్ లైన్స్ హాస్య గల్పిక , సుధేష్ " పుక్కిట పురాణం" ఇర్షాద్ గారి “ నిలబడే హాస్యం”, చిట్టెన్ రాజు గారి " ఘంటసాల-కంఠశోష", నెల్లుట్ల సుదర్శన రావు గారి " తెలుగు సాహిత్యం లో హాస్యం" అన్నీ కూడా బావున్నాయి.

గోవిందరాజు మాధవరావు గారు" చెప్పుకోండి చూద్దాం" పేరిట కొన్ని సినిమా పాటలు వినిపించి అవి ఏ సినిమా నుంచి, రాసింది ఎవరు? సంగీత దర్శకత్వం ఎవరూ? అంటూ అడిగిన క్విజ్ లో అందరూ పోటీలు పడి మరీ సమాధానాలు చెప్పారు. చివరి బెంచీ లో కూర్చొని సుధేష్, జేవి అరుణ్ ఆద్యంతం అల్లరి చేశారు.

తెలుగు నేర్పించటం లో , నేర్చుకోవటం లో తమ బడి లో చేపట్టిన వినూత్న విధానాల గురించి రాం డొక్కా , ఐ ఫోన్ లో తెలుగు గురించి శ్రీకాంత్ చింతల, వేమనపద్యాలు -సీత ముత్యాల ఇంగ్లీష్ అనువాదం గురించి చిట్టెంరాజు, అల్లసాని పెద్దన గురించి తుర్లపాటి ప్రసాద్, పద్యాలు, సామెతలు, పొడుపు కథల గురించి వై వి రావు, ఎక్కడి నుంచి ఎక్కడిదాకా శీర్షికన ....తెలుగు భాష చేసిన ప్రయాణం గురించి సత్యం మందపాటి చక్కటి ప్రసంగాలు చేశారు.

తెలుగు సాహిత్యానికి సంబంధించి కవిత్వం-మౌలిక భావనల గురించి విస్తృతమైన అంశాన్ని ప్రసంగం కోసం సింపుల్ గా కవిత్వం అనే బ్రహ్మపదార్ధం ఎలా అర్థం చేసుకోవచ్చో చంద్ర కన్నెగంటి, ఇంటర్నెట్ యుగం తెలుగు సాహిత్యం మీద తెచ్చిన మార్పు, బ్లాగుల సాహిత్య సేవ గురించి అఫ్సర్, కొసరాజు కవితా వైభవం గురించి మద్దుకూరి చంద్రహాస్, చలం గీతాంజలి గురించి సాయి రాచకొండ, గుంటూరు శేషేంద్ర శర్మ కవిత్వం , ఆయన రచించిన " నా దేశం - నా ప్రజలు" గురించి సురేశ్ కాజా చక్కగా ప్రసంగించి చాలా రోజుల తర్వాత మంచి సాహిత్య సదస్సు కి వెళ్ళిన అనుభూతి కలిగించారు.

ఆ తర్వాత అనంత్ మల్లవరపు, సుమ పోకల, మీనాక్షి చింతపల్లి, పద్మ, శేషిగిరావు దేవగుప్తాపు, రమణి విష్ణుభొట్ల, ప్రసాద్ కాకి, తదితరులు ( నాకు గుర్తున్నంతవరకూ రాశాను...ఎవరినైనా మర్చిపోతే సారీ) తమ తమ స్వీయ రచనలు చదివి వినిపించారు.

మధ్యలో మంచి విందు భోజనం, టీ, అల్పాహారం లాంటివి సదస్సు లో చెప్పిన విషయాల కంటే కూడా రుచికరం గా వున్నాయి.

కీర్తన ప్రయాగ , ప్రియాంక రెడ్డి, రిత్విక్ మర్యాల, కవితా మర్యాల,రోహన్ సాని, అఖిల రెడ్డి తెలుగు పద్యాలు చెప్తుంటే, నాలుగేళ్ళ పాప ఎక్కడ తడుముకోకుండా మా తెలుగు తల్లికి మల్లెపూదండ అలవోకగా పాడుతుంటే అమెరికా పిల్లల దగ్గర ఇంకా తెలుగు భాష సజీవం గా వుందని ఆనందం వేసింది.

మూడు భాగాలుగా జరిగిన ఈ సమావేశాలకు ఏలేటి వెంకటరావు గారు, దివాకర్ల సురేఖామూర్తి( తిరుపతి వెంకట కవుల్లో ఒకరి మునిమనవరాలు , అద్భుతమైన గాయని) శేషగిరిరావు దేవగుప్తాపు అధ్యక్షతలు వహించారు.

ఈ మొత్తం కార్యక్రమాన్ని వోపికగా కూర్చొని వీడియా తీశారు ఉరిమిండి నరసింహారెడ్డి.

కార్యక్రమానికి హైలెట్ ఈ తరం వారికి సినీ నటుడిగానే తెలిసినా, గిరీశం పాత్రతో ఆంధ్ర దేశాన్ని ఒక కుదుపు కుదిపేసిన జేవి రమణమూర్తి గారి జ్నాపకాలు. జేవి రమణమూర్తి గారు మనకు చెప్పాల్సినవి, ఆయన నుంచి మనం తెలుసుకోవాల్సినవి చాలా వున్నా, ఈ సదస్సు లో సమయాభావం వల్ల ఆయన ఎక్కువ సేపు ప్రసంగించలేకపోవటం విచారకరం.

సాహిత్య సదస్సు తర్వాత దివాకర్ల సురేఖా మూర్తి ( అపర జానకి) మణి శాస్త్రి , బాల కామేశ్వర రావు( అపర ఘంటసాల ) ముగ్గురూ ఘంటసాల పాటలు (ఆయన సంగీత దర్శకత్వం లో వచ్చినవి కూడా) పాడి ప్రేక్షకుల్ని కట్టి పడేశారు. మరీ మూడు గంటలు కాకుండా ఒక రోజంతా ఈ పాటల పందిరి కొనసాగి వుంటే బావుండేది. ఇలా ఒక రోజంతా సంగీత సాహిత్యాలతో మాకు పొద్దుపోయింది.

Tuesday, September 28, 2010

యూటీ ఆస్టిన్ కాంపస్ లో ఎకే-47 తో కాల్చుకొని విద్యార్ధి ఆత్మహత్య



యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ -ఆస్టిన్ కాంపస్ లో ఒక ఇక్కడి కాలమానం ప్రకారం ఉదయం ఎనిమిది గంటల 10 నిముషాలకు Perry-Castañeda Library లో ఆరో అంతస్తు లో కొల్టన్ టూలే (19) మేధమెటిక్స్ మేజర్ సోఫోమోర్ విద్యార్ధి ఏకె -47 రైఫిల్ తో కాల్చుకొని చనిపోయాడు. అయితే ఈ ఆత్మ్యహత్య కు కారణాలు మాత్రం ఇప్పటి దాకా తెలియలేదు. ఇంకెవరూ ఈ సంఘటన లో గాయపడలేదు. ముందు జాగ్రత్త చర్య గా వెంటనే కాంపస్ మూసివేశారు. షటిల్ బస్ సర్వీసులు కూడా రద్దు చేశారు.
సంఘటన జరిగిన లైబ్రరీ ప్రధానమైనది. లైబ్రరీ లోపలకు వెళ్ళటానికి ముందు కింద ఇద్దరు సెక్యూరిటీ గార్డ్స్ కూడా వుంటారు. తుపాకీలు తీసుకొని లోపలకు వెళ్తుంటే సెన్సర్స్ మోగాలి కదా! ఇంతవరకూ యూటీ లో ఇలాంటి సంఘటనలు జరిగినట్లు లేదు. బహుశా ఈ సంఘటన తో సెక్యూరిటీ ని ఇప్పుడు మరింత ఎక్కువ చేస్తారు కాబోలు.
అమెరికన్ యూనివర్సిటీల్లో ఈ తుపాకీ కాల్పుల లాంటి సంఘటనలు ఎప్పటికప్పుడు ఎక్కువవటం కొత్తగా ఇండియా నుంచి ఇక్కడకు చదువుకోవటానికి వచ్చే విద్యార్ధులకు, వారి కుటుంబాలకు కూడా ఆందోళన కలిగించే విషయమే.అసలు మామూలు ప్రజానీకానికి, మరీ ముఖ్యం గా విద్యార్ధులకు ఎకే -47 లాంటి ఖరీదైన తుపాకులు అంత సులభంగా ఎలా లభ్యమవుతున్నాయి అన్నది అందరూ ఆలోచించాల్సిన విషయం.

Monday, September 27, 2010

ఎవరైనా నాకు రెసెపీ లు పంపిస్తారా?

" గుర్తుకొస్తున్నాయి " శీర్షికన ఏమైనా రాయమని అడిగారు ప్రమదావనం ప్రమదలు. ఏం గుర్తుకొస్తున్నాయి? ఏం రాద్దాం? అనుకుంటూ ఒక కప్పు కాఫీ పెట్టుకుందామని వంటింటి లోకి వెళ్ళగానే దేని మీద రాయొచ్చో ఒక అవుడియా వచ్చేసింది. అమ్మాయిలకు వంటింటి లోకి వెళ్ళగానే అమ్మ గుర్తుకు వస్తుంది. నాకు మాత్రం మా నాన్న గుర్తుకు వస్తారు. నన్నూ, నా వంటింటి ని అంతంగా ప్రభావితం చేసిన ఆయన మహోపకారం కూడా గుర్తుకువస్తుంది.


నేను టెన్త్ లోనో,ఇంటర్ లోనో వున్నప్పుడు ఒకరోజు మా నాన్నగారితో సంఖ్యాశాస్త్రం నుంచి సాహిత్యం దాకా సవాలక్ష విషయాల్లో సందేహాలను అడుగుతున్న సమయాన మా అమ్మ వచ్చి " ఎప్పుడూ చూసినా మీ నాన్న తో కబుర్లేనా? వంటింటి లోకి రా, కనీసం కూరలు తరిగి పెడుదువు గానీ!” అంటూ ఆర్డర్ పాస్ చేసింది.

అప్పుడు నా పితృదేవుడు మా అమ్మ ఆర్డర్ ని ధీటుగా ఎదిరించి " ఛత్ నా కూతురికి వంట నేర్చుకునే ఖర్మెమిటి? దానికి నేను పెట్టిన పేరేమిటి? నువ్వు చెయ్యమంటున్న పనులేమిటి? అరిసెలు వత్తడం ఎవరైనా చేస్తారు. నేర్చుకుంటే ఎవరికైనా వస్తుంది. కానీ మంచి పుస్తకాలు చదవడం, రాయడం అందరికీ వచ్చే విద్య కాదు. " అంటూ ఎదురు క్లాస్ తీసుకుంటే మా అమ్మ మూతి మూడు వంకర్లు తిప్పి లోపలకు వెళ్ళిపోయింది.



అప్పుడు డిసైడ్ అయ్యాను. ఆ రాయటం ఏదో కష్టపడి నేర్చుకుంటే వంట చెయ్యక్కరలేదనుకున్నాను. అలా మొదలైంది నాలో రాయాలన్న తపన..తృష్ణ...

అలా మా నాన్న నన్ను వంటింటి లోకి వెళ్ళకుండా రక్షణ కల్పించటం వల్ల చాలా మంది అమ్మాయిలు పద్ధతి ప్రకారం వైనంగా నేర్చుకునే కుట్లు,అల్లికలు, పూలు మాలలు కట్టడం, కంది పచ్చడి రోట్లో మెత్తగా రుబ్బడం లాంటివి ఏవీ రాకుండానే పెద్దదాన్ని అయిపోయాను.
సామాన్యం గా మగవాళ్ళు పెళ్ళి చేసుకోవాలంటే స్వేచ్ఛ పోతుందని భయపడిపోతారు. కానీ నేను పెళ్ళి చేసుకుంటే వంట చేయాల్సి వస్తుందని భయపడి పోయాను.

కొన్ని కావాలంటే కొన్ని వదులుకోవాలిగా!

అలా అనుకోని పోనీలే, వంటే కదా, పక్కవాళ్లకు నేర్పిద్దాం లే అని పెళ్ళి చేసుకున్నాను.

ఇక వంటింటి లోకి వెళితే కుక్కర్ ఎలా పెట్టాలో తెలియదు, ( ఇంట్లో మనం చేసిన పని ఏదైనా వుంటే...పది విజిల్స్ రాగానే స్టవ్ ఆపేయ్యటమే)ఇడ్లీ పిండికి ఏ కొలతలు, గ్రైండర్ ఎలా పనిచేస్తుంది, అది ఆగకపోతే రీసెట్ బటన్ ఎక్కడుంటుంది లాంటి జనరల్ నాలెడ్జి బొత్తిగా నిల్.

నా ఖర్మ చాలక నేను వంటింట్లో కుస్తీలు పడుతున్న రోజుల్లో మా ఇంట్లోకి రెండు కూరగాయలు వచ్చి నా ప్రజ్నా పాటవాల్ని మరింత బట్టబయలు చేశాయి. ఒకటి పొట్లకాయ, రెండోది సొరకాయ . రెండూ వేటికవే గొప్ప కూరగాయలు లెండీ! ఇక చూస్కొండి నాకు డౌట్స్ మీద డౌట్స్. పొట్ల కాయకు చెక్కు తీయాలా, వద్దా? సొరకాయ కి తొక్కు తీస్తారని తెలుసు( కొంచెం పనిమంతురాలినే కదా) . అప్పటికే మనకి కొద్ది మందికి తాట తీసిన అనుభవం వుంది కదా. ఆ రెండింటి కి లోపల అదేమిటో తెల్లగా బ్రహ్మ పదార్ధం, కొన్ని గింజలు కనిపించాయి. అవేం చేయాలో తెలియలేదు. పారేయ్యాలా? లేక అవి కూడా ముక్కలతో పాటు వేసి కూర చేయాలా? అని.


అలా అప్పటి నుంచి నేను , నా వంట కొద్ది కొద్దిగా ఎదుగుతూ వచ్చాము. ఇప్పుడు ఈ దేశం లో ఏదైనా పాట్ లక్ ఫంక్షన్ అంటే ఏవో నాలుగైదు రకాల వంటలు చేసుకొని తీసుకెళ్లగలిగే స్థాయి కి ఎదిగాను.

అయినా కూడా విధికి నా మీదేప్పుడూ చిన్న చూపే!

సునాయాసం గా వంట చేయగలిగే స్థాయి కి ఎదిగినా సరే...నాకు తెలుగు భాష లో నచ్చని అనేక పదాల్లో ఒకటి " రెసెపీ". అసలు ఎవరైనా ఏదైనా ఇలా చేయండి అని చెప్తే తింగరిబుచ్చి లాగా తప్పకుండా అలా చేయకుండా వుండెలా జాగ్రత్త పడతాను.

ఒక గ్లాస్ కి రెండు గ్లాసుల నీళ్ళు పోసి అన్నం వండమని ఎవరైనా చెపితే ఒకటి కి ఒకటిన్నరో, రెండున్నరో పోసి ఎలా వస్తుందో చూడాలని నాకు మహా ఉత్సాహం గా, క్రియేటీవ్ అవుడియాలు అన్నీ వస్తుంటాయి.

ఇండియా లో ఎప్పుడూ ఈ రెసెపీ ల అవసరం పడలేదు. బండి ఎలాగోలా నెట్టుకొచ్చేసాము. అదృష్టవశాత్తూ పేపర్ ఆఫీస్ లో ఉద్యోగం..మధ్యాహ్నం వెళితే ఏ రాత్రి 11 కో, 12 కో ఇంటికి చేరటం.చేతి కింద నలుగురు పనివాళ్ళతో " సర్వ స్వతంత్రం " గా బతికాను. నేను వంట బాగా చేయాల్సిన టైం వచ్చేసరికి ఇండియా లో రెస్టారెంట్ల కల్చర్, కర్రీ పాయింట్ల కల్చర్ పెరిగింది. అలా అవన్నీ నన్నూ, నా మాంగల్యాన్ని కాపాడాయి.

నా జాతకం లో మహర్దశ అయిపోయేటప్పటికి నేను అమెరికా వచ్చి పడ్డాను. ఇక మా నలుగురు పని మనుషులు చేసే పని, మా ఇంట్లో మా ముగ్గురి పని ( నా పని కూడా నేనే చేసుకోవాల్సి వచ్చిందని ప్రత్యేకం గా మనవి చేసుకుంటున్నాను.) కూడా నేనే చేయాల్సి వచ్చింది.

వారం వారం ఎక్కడో అక్కడ పాట్ లక్ లు. ఏదో ఒక మహత్తర వంటకం చేసి తీసుకెళ్ళాలి. అక్కడితో మన పని అయిపోదు. అది తిన్నాకా వావ్, వీవ్ అంటూ కాకుల్లా ఏవో ధ్వనులు చేసి ఎలా చేయాలి అంటూ రెసెపీ లు అడుగుతారు. ఏమిటి చెప్పటం నా మొహం వాళ్ళకు...మనకు అన్నీ ఉజ్జాయింపు గా వేయటమే తెల్సు కానీ కొందరేమో సుతారం గా ఉప్పు వేయటానికి కూడా ఒక స్పూన్ తీసుకొని తయారవుతారు. ఇంత ఉప్పు తీసుకొని అలా పడేసి ఆ చేతిని ఇలా నైటీ కో, ఫాంట్ కో పులుముకోవడం మన సంప్రదాయం, ఆచారం . ఏ మాటకామాటే చెప్పుకోవాలి. నేను మాత్రం ఇలాంటి ఆచారాల్ని తూచా తప్పకుండా పాటిస్తాను..

మొదట్లో ఈ పాట్ లక్ లకు పులిహోర చేసి తీసుకెల్ళేదాన్ని.అదైతే వీజీ...వీజీ...అప్పట్లో మా దగ్గర ఒక్క తెలుగు మొహంకూడా వుండేది కాదు. సౌత్ ఇండియన్ ఫుడ్ అంటూ ఏది తీసుకెళ్ళినా మొత్తం గిన్నె అంతా ఖాళీ చేసెసేవారు. కానీ ప్రతి సారీ అదే తీసుకెళ్లలేమ్ కదా. అలా తీసుకేళితే మనకు పెద్దగా వంటలు రావన్న విషయం తెలిసి పోతుంది కదా. పైగా వాళ్ళేమే కష్టపడి రాజ్మా కూర్మా లాంటివి చేసుకొస్తుంటే మనకు కూడా ప్రేస్టేజి పాయింట్ వచ్చేసింది. అది నాకె కాదు మొత్తం సౌత్ కె అవమానం గా ఫీల్ అయి వెరైటీ వంటలు నేర్చుకోక పోతే ఇక్కడ ఐడెంటిటీ ఇస్యూ వస్తుందని భయపడ్డాను.

ఇక అప్పటి నుంచి నా కష్టాలు మొదలండీ బాబూ...రెసెపీ ల కోసం వెతకటం..నెట్ ఎక్కి కూర్చొని ఆంధ్ర వెజిటేరియన్ అని కొట్టగానే వందలాది వెబ్సైట్లు, రెసెపీలు, యూ ట్యూబ్ లింక్ లు కూడా. ఇండియాలో వున్నప్పుడు ఎవరైనా చేసి పెడితే తినడం, లేకపోతే కొనుక్కోని తినడం తప్ప..ఈ కుక్ బుక్ ల కల్చర్ బొత్తిగా మనకు అలవాటు లేదయ్యే! అలాంటిది నెట్ లో నుంచి రెసెపీ లు ప్రింట్ చేసుకోవడం, పక్కన పెట్టి అది చదువుతూ వంట చేయడం...

అదేమిటో నేను రెసెపీ ప్రకారమే చేద్దామని కొన్ని సార్లు అనుకునేదాన్ని కానీ ఎప్పుడూ కూడా అందులో చెప్పినవి ఒకటో రెండో నా దగ్గర వుండేవి కావు. పోనీలే లేని వాటిని వదిలేసి వున్న వాటితో చేసుకుందాం అని అలా చేసెసేదాన్ని. ఈ సారి షాపింగ్ కి వెళ్ళినప్పుడు గుర్తు గా అవి తెచ్చేదాన్ని. కానీ ఇంకో రెసెపీ లో ఇంకేవో అడిగేవాడు.ఇలా నా కిచెన్ కౌంటర్ నిండా వెనెగర్, సోయి సాస్ లాంటి బ్రహ్మ పదార్దాలు అన్నీ వచ్చి చేరిపోయాయి కానీ వాటిని నేను మూత తీసి వాసన చూసే సందర్భాలు కూడా రాలేదు.

ఇలా వుండగా...నాకు ఇంట్లోనే ప్రతిపక్షం తయారైంది.

నాకెమో ఏవీ లేకపోతే వేడి అన్నం, కంది పచ్చదో, పొడి నో వుంటే చాలు. అఫ్సర్ కెమో కక్కా, ముక్కా తిన్న నోరు....మనమేమో ప్యూర్ ఆంధ్రా వెజిటేరియన్ ఫుడ్ తో సంవత్సరాల తరబడి వాయించేస్తున్నాము. కంది పొడి తోనా అంటూ అయోమయం గా చూస్తాడు. మా చిన్నూ గాడికి మాటలు రానంత కాలం అన్నం నోట్లో కుక్కేస్తే సరిపోయేది. వూహ తెలిశాక, ఇదేమిటి అని అడగటం కాకుండా, ఎందుకిలా వుంది అని ప్రశ్నించటం కూడా నేర్చుకున్నాడు. అలాంటప్పుడు మాత్రం ఆ స్టాట్యూ ఆఫ్ లిబర్టీ ని పగల గొట్టాలనిపిస్తుంది. వాడు నెమ్మదిగా ఎదిగాడు.ఎంత దాకా ఎదిగాడు అంటే రోజూ నా వంటకు మార్కులు వేసే వరకూ...పప్పో, కూరో నోట్లో పెట్టుకొని పది కి మూడు, పోనీలే నాలుగు అంటాడు...అవి నాకు ఆ రోజు వచ్చిన వంట కి మార్కులన్న మాట. నేను నోట్లో పెట్టుకొని తిని బాగానే వుంది కదరా అంటూ వాడి వైపు, చెప్పవేమిటి అంటూ తన వైపు ( ఎవరో తెలుసు లే మీకు) ఉరిమి చూస్తే...” మీ టేస్ట్ బడ్స్ పాడైపోయాయి.” అంటాడే గానీ వాడి అభిప్రాయాన్ని మాత్రం మార్చుకోడు.

ఇలా అమెరికా లో ఏదో మా ఇంట్లో మా వంటలు మేం తిని మా మానాన మేం బతుకుతూ వుంటే ఇండియా నుంచి ఒక స్నేహితుడు అమెరికా ట్రిప్ కి వచ్చాడు. నేను అలవాటు ప్రకారం రోజూ ఎవడు వంట చేస్తాడు అనుకోని అతను వచ్చిన మొదటి రోజు ప్రేమ గా సాంబారు , కూర, పప్పు చేశాను. అందరం తిన్నాక ఇంకా బోలెడు మిగిలింది. అన్నీ ఫ్రిజ్ లో పెట్టాను. అవి అయితే కానీ కొత్తవి చేయటానికి లేదు. ఎందుకంటే అవి మిగిలితే పెట్టడానికి ఫ్రిజ్ లో ఖాళీ వుండోద్దు? ఈ రకమైన టెక్నికల్ డిఫికల్తీ వల్ల అతను వున్న మూడు రోజులు అదే సాంబారు, పప్పు, కూర పెట్టి పంపించాను. అందుకని ఇప్పటికీ నన్ను దెప్పుతుంటాడు " మీ ఇంటికి వస్తే చద్ది కూడు పెట్టారు " అని.
అదేమిటో ఎవ్వరూ అర్థం చేసుకోరూ....!

ఇది ఇలా వుండగా...నా టైం బాగుండక క్రితం సారి ఇండియా వచ్చినప్పుడు మా వాడు మా అమ్మ చేతి వంట, మా అక్క చేతి వంట తిన్నాడు. మా అక్క చాలా బాగా వంట చేస్తుంది. అన్నింటి లో మనకు పూర్తి వ్యతిరేకం. మా అక్క అచ్చంగా " డొక్కా సీతమ్మ" టైపు. పెద్దల ఎదుట నోట్లోంచి మాట రాదు. వినయ విధేయతలు పూర్తిగా పుణికి పుచ్చుకున్న సాధ్వీమ తల్లి. ఇక్కడకు తిరిగి వచ్చేసే ముందు మా అక్క వాళ్ళింటికి వెళ్ళి భోజనం చేసాకా మా వాడు " ఆమ్మా! నువ్వు కూడా అమెరికా వచ్చేసి మాతో వుండిపో" అని తెగ గొడవ చేస్తుంటే మా అక్క అబ్బా, వీడికి నా మీద ఎంత ప్రేమ అని మా బావ గారికి చెప్పి మురిసిపోతుంటే...ఓసీ పిచ్చిమొహమా! అది నీ మీద ప్రేమా కాదే తల్లీ,,,నువ్వు వస్తే హాయిగా కడుపు నిండా భోజనం చేయచ్చని వాడి ఆశ అంటే..ఇక మా అక్క....పిల్లాడికి ఇష్టం గా వంట చేసి పెట్టక నువ్వు చేసే పనేమిటే అని నాకు హితబోధలు మొదలుపెట్టింది.

నేను విననట్లు పక్కకెళ్లిపోయాను. అంతకన్నా మనమేం చేయగలమ్ చెప్పండి....

ఏదో ఇలా వంట వచ్చీ రాక...ఇలా బ్లాగుల్లో కళ్ళనీళ్ళు వత్తుకుంటూ ఏవో నా బాధలు రాసుకుంటూ బతికేస్తుంటే...ఇప్పుడు నా ప్రాణానికి జ్యోతక్క తయారైంది. షడ్రుచుల పేరుతో...ఏవో ఒకటి రాయడం, ఇది చాలా ఈజీ..చాలా టేస్టీ అంటూ ఏదో ఒక పోస్ట్ రాయడం , దానికి రెసెపీ లు ఇవ్వడం,పైగా నోరూరిస్తూ ఫోటోలు ఒకటి....

వొట్స్ తో ఇవి చేసుకోవచ్చు. అవి చేసుకోవచ్చు. ఓట్స్ దద్దోజనం, ఓట్స్ పులిహోర, ఓట్స్ పాయసం, ఓట్స్ తద్దినం అంటూ....ఒక చేంతాడంతా లిస్ట్.

అది చూశాక ప్రాణం వొప్పదు. తెల్లారి లేచి వంటింటిలోకి వెళితే అక్కడ ఆ ఓట్స్ డబ్బా కనిపిస్తుంది. చేయాలో, వద్దో తెలియదు. మళ్ళీ ఆ కంప్యూటర్ మీదకెక్కి ఆ రెసెపీ చదివి వచ్చి అలా చేసి అది ఎందుకు అంత బాగా రాలేదో అర్థం కాక బాధపడి, మళ్ళీ అక్కడ కామెంట్ పెట్టి, ఆమె మరో సలహా ఇచ్చి ...ఇదంతా నాకిప్పుడు అవసరమా....అనుకోని కామ్ గా అంతఃసాక్షి ని, మనఃసాక్షి ని. ...ఇంకేం సాక్షులున్నాయో వాటినన్నింటిని అణగతొక్కేసుకొని ఎప్పటిలాగానే అందులో ఇన్ని పాలు పోసుకొని ఒక నిముషం మైక్రో వేవ్ లో వేడి చేసుకొని హాయి గా తింటూ " Eat, Pray, Love” చదువుకున్నాను.

అది అయిపోయిందా ఆండీ...మళ్ళీ మొన్న రకరకాల సమోసాలు అంటూ...ఇంకో పోస్ట్ పెట్టింది. అసలు సమోసాలు చేయటమే కొంచెం టైం తో కూడుకున్న వ్యవహారం. చాలా వోపికగా, నిదానం గా, కొన్ని గంటలు వంటింటి లో కష్టపడితే ఓ కే ... కొన్ని సమోసాలు వస్తాయి. మనమేమో వారానికి ఒకసారి ఆ ఇండియన్ షాప్ కి వెళ్ళి డాలర్ కి ఒక సమోసా కొనుక్కోని తినేసి వస్తున్నాం కదా. మళ్ళీ ఇదంతా ఎవరు పడతారు అనుకోని చూసీ చూడనట్లు వూరుకున్నాను.

ఇంతలో లాప్ టాప్ మీద నుంచో,లోపల నుంచో ఒక కేక....ఎందుకంటే ఆ లాప్ టాప్ ఎదురుగుండా చాలా సేపు కూర్చున్నాక ఏమవుతుంది అంటే వారే వీరు, వీరే వారు అయిపోతారు. ఎవరు లాప్ టాప్ నో? ఎవరు రూప స్వరూపమో తెలియదు. అలా ఒక కేక వినిపిస్తే వెళ్ళి మళ్ళీ ఏంటీ అని అడిగితే....ఎన్ని రకాల సమోసాలో చూడు...కొంచెం ట్రై చేయచ్చు కదా...ఆ తన్హాయి రాసుకునేబదులు రోజంతా..అన్నాడు. ఇక చూడు...నా సామి రంగా...అరికాలి మంటలు ఇలా మౌస్ మీదకు వచ్చేశాయి.

చాలా మంది మహిళలు ఇలా తమకు వచ్చిన వంటలన్నీ రెసెపీలు, ఫోటోలతో కూడా బ్లాగుల్లో పెట్టడం వల్ల నాలాంటి అమాయక స్త్రీలు ఇంట్లో నానా రకాలా వేధింపులకు గురవుతున్నారని , కాబట్టి ఇక నుంచి వంటలు అని టాగ్ వున్న బ్లాగుల్నీ ముఖ్యం గా షడ్రుచుల్ని యాగ్రి గేటర్ ల నుంచి తీసేయ్యాల్సింది గా కోరుతూ కూడలి,మాలిక, హారం,జల్లెడ కి ఒక విజ్నాపనపత్రం పంపించేశాను.

ఇప్పుడు చెప్పండి.ఎవరైనా నాకు రెసెపీ లు పంపిస్తారా? పంపిస్తే....


( సరదాగా రాసిన ఈ పోస్ట్ లో ....జ్యోతి, షడ్రుచుల పేర్లను వాడుకున్నందుకు క్షమాపణలు)

Friday, September 24, 2010

చుప్కే...చుప్కే...చోరీ-2





అఫ్సర్ నా నోరు మూయించారని నేను బ్లాగుముఖంగా వొప్పుకునేటప్పటికి ఎంత మంది పురుషులు కళ్ళు, యాంటీ స్త్రీవాదుల కళ్ళు చల్లబడ్డాయో.....నాకు తెలుస్తూనే వుంది...

అఫ్సర్ నాకు చెప్పిన విషయ కథాక్రమంబెట్టిదనిన....

ఇంక హాస్యం గా రాయటం మన వల్ల కాదు బాబు....నా ఒరిజినల్ స్టయిల్ లోకి వచ్చేస్తున్నాను....

శారద నటరాజన్, రావూరి భరద్వాజ, ఆలూరి భుజంగరావు ముగ్గురూ తెనాలిలో వుండగా మంచి మిత్రులు..ఒకే చోట కలిసి బతికారు. స్నేహాన్ని, ప్రేమను, కష్టాల్ని కన్నీళ్ళను కలిసి పంచుకున్న ముగ్గురు ప్రాణ స్నేహితులు. శారద నటరాజన్ హోటల్ లో సర్వర్ గా పనిచేసిన సమయం లో రావూరి భరద్వాజ గారు ఏవో చిన్న చిన్న కూలీ పనులు చేసుకొని బతికారట. సరే, ఇక ఆలూరి భుజంగరావు గారి వ్యక్తిగత జీవితం గురించి పెద్దగా మనకు వివరాలు తెలియదు కానీ ఆయన ది కూడా దాదాపు ఇదే పరిస్థితి. ఆయన కొన్ని రచనలు అచ్చం చలం లాగా రాశారట. మరీ ముఖ్యంగా డబ్బు కోసం రాసిన శృంగార/ డిటెక్టివు రచనల్లో చలం శైలిని బాగా అనుసరించరే వారట.
ఇక శారద కథ “స్వార్థ పరుడు” విషయానికి వస్తే, ఆ కథ వెనక కథ ఏమిటో మనకి కచ్చితంగా తెలిసే అవకాశం లేదు.
ముగ్గురూ కలిసి మెలిసి వుంటున్న ఆ కాలంలో సాహిత్య చర్చలు చేసేటప్పుడు కొన్ని రకాల ఇతివృత్తాల్ని అనుకొని వాటి మీద రచనలు చేయాలని అనుకొనివుండొచ్చు. అంతే తప్ప రావూరి భరద్వాజ గారికి శారద రచనల్ని అనుసరణ చేయాల్సిన అవసరం వుంటుందనుకోనని అఫ్సర్ అంటాడు. పైగా, వాళ్ళ మధ్య వున్న స్నేహబలం కూడా గట్టిదే.

శారద సాహిత్యాన్ని 2002 లో తెనాలి లో శారద సాహిత్య వేదిక వాళ్ళు ప్రచురించి ఆవిష్కరణ సభ చేసినప్పుడు రావూరి భరద్వాజ ఆ సభలో ప్రసంగించి అనేక ఆసక్తికరమైన విషయాల్ని వెల్లడించారట. ఆలూరి భుజంగరావు గారు శారద జీవితం గురించి " సాహిత్య బాటసారి శారద" పేరుతో ఒక పుస్తకమే ప్రచురించారు. ఈ పుస్తకం తనకి నచ్చిన పుస్తకాల్లో వొకటి అంటాడు అఫ్సర్. రచయితల మధ్య స్నేహాలు కనుమరుగయిపోతున్న ఈ కాలంలో ఆ పుస్తకం ప్రతి వొక్కరూ చదవదగిందని అంటాడు.

ఇంత చెప్పాక...ఇక నోరు తెరిచి మాట్లాడటానికి ఏముంటుంది? అసలైనా డ్రైవింగ్ చేసేటప్పుడు సాహిత్య చర్చలేమిటి? అంటూ సన్నగా సన్నాయి నొక్కులు నొక్కుతూ తల పక్కకు తిప్పేసుకున్నాను.

నా గ్రహచారం బాగలేదని తెలుసు కానీ ఇంత అడ్డంగా అఫ్సర్ కి దొరికిపోతాననుకోలేదు..

సరే, ఈ విషయం గురించి నేరుగా రావూరి భరద్వాజ గారినే అడిగి ఆయన ఏం చెప్తారో తెలుసుకుందామనుకున్నాను కానీ పాపం ఆయనకు వొంట్లో బాగుండక ఆస్పత్రి లో వున్నట్లు తెలిసింది. నిజానికి ఆయన ఆరోగ్యం బాగుంది వుంటే, ఈ వారం టెంపుల్ టెక్సాస్ లోనూ, వచ్చే నెల ఇండియానాపాలిస్ లోనూ జరగనున్న సాహిత్య సభలకి రావాల్సింది.
ఎన్నో మంచి మంచి అనువాదాలు చేసి చివరి రోజుల వరకూ సాహిత్యపరం గా ఎంతో యాక్టివ్ గా వున్న ఆలూరి భుజంగరావు గారు రెండేళ్ళ క్రితమే మరణించారు...ఎవరికైనా భుజంగరావు గారి " సాహిత్య బాటసారి శారద" పుస్తకం దొరికితే మనకు శారద జీవితం గురించి , సాహిత్యం గురించి మరీన్ని వివరాలు తెలిసే అవకాశం వుంది.

చివరగా నేను చెప్పబోయేదేమిటంటే....ఇంతకు ముందు పెట్టిన డిమాండ్ నే మళ్ళీ పెట్టడం....
అఫ్సర్ బుర్రలో చాలా సాహిత్య విశేషాలున్నాయి. ఇలా ఏదో సందర్భం వచ్చినప్పుడు నాకు చెప్తూనే వుంటారు గానీ వాటిని అక్షరబద్ధం చేయమంటే బద్దకిస్తూ వుంటారు.
చాలా సంవత్సరాలు ఆంధ్ర జ్యోతి తదితర సాహిత్య పేజీలు, ఆదివారం సంచికల నిర్వాహకులుగా వుండడమే కాక, చాసో నించి ఈ తరం రచయితల దాకా కనీసం మూడు తరాల సాహిత్య వేత్తలతో తనకి వున్న సన్నిహిత పరిచయాలు ఎంతో విలువయినవి. అలాగే, ఎన్నో వాద వివాదాలకి ప్రత్యక్ష సాక్షి కూడా. వాటి గురించి విలువైన సమాచారాన్ని తన బ్లాగు ద్వారానైనా మనందరికి తెలియచేస్తే బావుంటుంది కదా....

ఈ పోస్ట్ రాయడానికి ప్రధాన కారణం కొన్ని సార్లు కొన్ని విషయాల్లో పైకి కనిపించేది చూసి అదే నిజమని మనం పొరపాటు పడతాం. భరద్వాజ గారిది అనుసరణేమో అని నేను పొరపాటు పడ్డాను అని వొప్పుకోవటమే ఈ టపా ఉద్దేశం...

శారద రచనల మీద సమగ్ర వ్యాసం రాయటం, ఆయన కథ ను చర్చకు పెట్టడం ద్వారా ఈ చర్చకు మూల కారణమైన మాలతి గారికి కృతజ్నతలు...

చోరీ కి గురైన అఫ్సర్ కవిత ---” సగమే గుర్తు"


అఫ్సర్ గారి ఏ కవిత చోరీ కి గురైంది అన్న విషయం తెలుసుకోవాలని, ఆ కవిత చదవాలని కొందరు ఆసక్తి చూపిస్తున్న కారణం గా ఆ కవిత ని ఇక్కడ పోస్ట్ చేస్తున్నాను. ఈ కవిత " ఊరి చివర" కవిత్వ సంకలనం లో వుంది. మొదటి సారి ఈ కవిత ఆంధ్రజ్యోతి ఆదివారం లో ప్రచురితమైంది. కాపీ కి గురైన తర్వాత కూడా అదే టైటిల్ తో కవి పేరు మార్పు తో మళ్ళీ ఆంధ్రజ్యోతి లోనే ప్రచురితమైంది. ఈ కవిత ని అఫ్సర్ కవిత గా గుర్తించిన కవి నందిని సిధారెడ్డి.
సగమే గుర్తు

1.

వానది వొక్కటే భాష ఎప్పుడయినా ఎక్కడయినా.
దేహం పిచ్చుక సందేహ స్నానాల కింద తడుస్తూ.
వాన
లోపల్నించి కురుస్తుందా?
బయట్నించా?
నీకు గుర్తుండకపోవచ్చు
బహుశా నిన్న కురిసి వెళ్ళిపోయిన బచ్ పన్.
నీ వంటిని
ఇంటి ముంగిటి నీళ్ళల్లో
విడిచి వెళ్ళిపోయిన కత్తి పడవల్లో ఏముందో!
ఇప్పుడింక కురవడం మానేశాయేమో గాని
కాళ్ళ కింద తడి, బురదా అల్లాగే అంటుకునున్నాయి.

2.

లాగూ చొక్కా ఇంకా అట్లా జ్నాపకానికి వేలాడుతున్నాయి
మరీ చిన్నప్పటి వాసనేస్తున్నానా?
నిజమే!
మరపు తెరలు మరీ పల్చగా, మసగ్గా.
కనీ కనిపించని దూరపు మంచు మబ్బుల పరుగులు.

3.

మృగశిర ని మింగలేక
బయటికి కక్కలేక
కడుపులో పగుల్తున్న దుంప నేల
నీటి చినుకు పడంగానే ముందు పొగలు చిమ్ముతుంది
తరవాత
మళ్ళీ గతాన్ని తవ్వి తోడేసే పచ్చి వగరు వాసనవుతుంది.

4.
ఎన్ని వానలు చూళ్ళేదని?
మళ్ళీ
ప్రతి వానా అదేదో కొత్త వాసనేస్తుంది.

5.

అన్నీ గుర్తుండాలనేం లేదులే!
కొంత గుర్తూ, కొంత మరపూ
కొంత శబ్దం, కొంత నిశ్శబ్దమూ,
వొకటి లేనప్పుడు ఇంకోటి
ఇంకోటి లేనప్పుడు వొకటి


6.

వాన
ఇప్పుడింకా ఆగకపోతే బావుణ్ణు
జొన్నరొట్టే కాలుతోంది
వొంటి సెగల మీద

అఫ్సర్

Thursday, September 23, 2010

చుప్కే...చుప్కే...చోరీ!(గ్రంధ చౌర్యాలు ---కొన్ని పిట్ట కథలు..)

మాలతీ గారి బ్లాగ్ లో " శారద" “ స్వార్ధ పరుడు" మీద జరిగిన చర్చ లో ఆస్ట్రేలియా శారద ఒక ఆసక్తి కరమైన విషయం చెప్పారు...రావూరి భరద్వాజ గారి కాదంబరి నవల, స్వార్ధపరుడు కి చాలా దగ్గర పోలికలున్నాయని...దాదాపుగా రెండూ ఒకేలా వున్నాయని, అందులో ఒక హోటల్ సర్వర్ పేరు నటరాజన్ అని కూడా.. ఇంత ఆసక్తికరమైన వివరాలు తెలియచేసినందుకు శారద గారికి ధన్యవాదాలు.

అది చూడగానే...నాకు వచ్చిన మొదటి ఆలోచన...శారద రాసిన చిన్న కథ ని చదివి ఆ స్ఫూర్తి తో రావూరి భరద్వాజ గారు ఓ నవల రాసివుంటారని...ఆ మాట ఒకరిద్దరితో కూడా అన్నాను...పాపం శమించు గాక!

అలా అనుకోవటానికి అంతకు ముందు ఒకరిద్దరితో అంతకు ముందు జరిగిన కొన్ని చర్చల ఫలితం కూడా వుందనుకోండి...ఈ మధ్య కాలం లో తరచూ రచయితలు కాపీలు కొట్టేసి వేరే వాళ్ల వర్క్ ని తమది గా చెప్పుకోవటం, లేకపోతే " ఆ, ఈ కథో, ఆ నవలో ఎవరు చదివి వుంటారు లే...” అనుకోని మార్చి రాసేసుకోని తమ పేరుతో చెలామణీ చేయించుకోవటం...లాంటి సంఘటనలు వింటూనే వున్నాము..ఈ రకమైన పనులు చేసిన వాళ్ళల్లో చిన్నవాళ్ళ దగ్గర నుంచి మహా మహా పేరు పొంది రచయితలుగా ట్రెండ్ సెట్టర్స్ ముద్ర వేయించుకున్నవాళ్ళ దాకా అన్నీ స్థాయిల్లో వున్నారు.

ఈ సందర్భంలో మా స్వానుభవం ఒకటి ఇక్కడ గుర్తు చేసుకుంటాను.

2005 లోనో, 2006 లోనో కాలిఫోర్నియా లో ఆటా సమావేశాలు జరిగినప్పుడు యథావిధిగా కథలు, కవితలు, నవలల పోటీ లు నిర్వహించారు..నాకు జ్నాపకం వున్నంత వరకూ ఆంధ్రజ్యోతి వారి సౌజన్యంతో ఆ ఏడాది ఆ పోటీలు నిర్వహించినట్లున్నారు. సరే, పోటీలకు రచనలు ఆహ్వానించారు. అందులోంచి కథల్ని, కవితల్ని ఎంపిక చేసి బహుమతులు ప్రకటించారు. అప్పుడు ఒక తమాషా జరిగింది. కవితాల్లో ఒకాయన కి ( ఆయనో, అబ్బాయో మాకు తెలియదు) కి మొదటి బహుమతి వచ్చింది. ఆ విజేతల పేర్లు కూడా పేపర్లో ప్రకటించేశారు. ఇక ఆ బహుమతి పొందిన కవితలు సువనీర్ లో అచ్చు కావాల్సి వుంది. ఆ సమయం లో తెలిసిన విషయం...ఆ మొదటి బహుమతి వచ్చిన కవిత....కాపీ కవిత...అది శివారెడ్డి నో, మరెవరో ప్రముఖ కవి ఆ కవిత ని గుర్తు పట్టి ఆ విషయాన్ని వెల్లడించారు. దాంతో ఆ కవిత కి ఆ బహుమతి ని వెనక్కు తీసేసుకున్నారు. అలా ఆయనెవరో కాపీ కొట్టిన కవిత ఎవరిదో కాదు...అఫ్సర్ ది..ఆ విషయం తెలియగానే...ఆటా వాళ్ళు నాలికకరుచుకొని అఫ్సర్ కి సారీ చెపుతూ మైల్స్ చేశారు. పాపం ఆ కాపీ కొట్టే ఆయనకు ఆ కవిత అఫ్సర్ ది అని తెలియదనుకోవాలో, లేక ఆ కవిత ని ఎవరూ గుర్తు పట్టలేరనుకున్నాడో ఆ పైన్న వాడికి తప్ప మరొకరికి తెలియదు. అప్పుడు అఫ్సర్ ఒక జోక్ చేశాడు...కాపీ కొడితే కొట్టాడు కానీ.. అప్పుడు ఇప్పుడు కూడా నా కవిత కి మొదటి బహుమతి వచ్చే విలువ వుందన్న విషయం తెలిసేలా చేశాడు అని....అదీ అఫ్సర్ కవిత్వానికి వున్న బలం అని తెలుసుకోవాలి.

ఇక ఇంకో ఉదాహరణ చెప్తాను...ఆ మధ్య కొద్ది కాలం క్రితం సీతాలక్ష్మి గారని మంచి తెలుగు పండితురాలు ( చాలా మందికి తెలిసే వుంటుంది..కానీ తెలియని వారి కోసం....బ్లాగు లో మలక్పేట రౌడీ గా సుప్రసిద్ధులైన వెలమకన్ని భరద్వాజ కు జన్మనిచ్చిన పుణ్యాతురాలు....భరద్వాజా...మీ స్టైల్ లో...హెహెహే.. ..)

మేమిద్దరం ఏదో సాహిత్య చర్చ చేస్తుంటే ఆవిడ ఒక ఆసక్తి కరమైన విషయం చెప్పారు...అడవి బాపిరాజు గారి నవల తుఫాన్ కి, యద్ధనపూడి సులోచనారాణి గారి ప్రసిద్ధ సెక్రెటరీ నవల కి దగ్గర పోలికలున్నాయని. అడవి బాపి రాజు గారి రచనలంటే ఆమెకు ప్రాణం. అలాగే సులోచనారాణి గారి అంటే అమితమైన అభిమానమున్న ఆవిడ నోటి నుంచి ఈ అభిప్రాయం విని నోరెళ్ళబెట్టడం నా వంతు అయింది...అదేమిటండీ బాబూ..ఇంత మంచి విషయాన్ని ఎక్కడా రాయకుండా ఇలా మీ దగ్గరే దాచుకున్నారు....ఇక లాభం లేదు...మీరొక వ్యాసం రాసేసేయండి..ఏ ఆంధ్రజ్యోతి వివిధ వాళ్లకే ఇచ్చేసి అచ్చేయిద్దాము. అసలే వాళ్ళకు ఈ మధ్య మంచి వ్యాసాలు ఏవీ దొరకటం లేదు...( సారీ కె. శ్రీనివాస్) ప్రపంచం మొత్తానికి ఈ విషయం తెలియచేద్దాము అన్నాను....పాపం ఆ తెలుగు టీచర్ గారు...కొంచెం మొహమాటపడి రాస్తానండీ అన్నారు కానీ...ఇప్పటి వరకూ రాయలేదు...ఈ విషయం మలక్ పేట రౌడీ కి తెలియదు..లేకపోతే 500 కామెంట్లు వచ్చే పోస్ట్ ఒకటి రాసే పడేసేవారు...( సారీ రౌడీ గారు....మీకు ఆ ఛాన్స్ ఇవ్వటం లేదు).

ఇక మూడో విషయం...ఈ కాపీ కొట్టే రచనల గురించి ఒక ప్రముఖ రచయిత్రి అనుభవం మీలో ఎంత మందికి తెలుసో లేదో అని మళ్ళీ ఇక్కడ గుర్తు చేస్తున్నాను.
మనందరి అభిమాన రచయిత యద్దనపూడి సులోచనారాణి నవలలు మొత్తం తమిళం లోకో, కన్నడం లోకో పూర్తిగా అనువాదమైపోయాయి. అది మంచి విషయమే కదా అనుకొకండి. అనువాదమైంది ఆమె పేరుతో కాదు,,,వేరేవరి పేరుతోనో. ఆ విషయం తెలుసుకున్న సులోచనారాణీ గారు ఒక మూడు నాలుగేళ్ళ క్రితం అనుకుంటాను...ఒక పెద్ద ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ విషయం లో ఆమె కోర్టుకీ కూడా వెళ్ళినట్లు తెలుసు,దానివల్ల పెద్ద గా ఉపయోగం లేకపోయినా....సులోచనారాణి గారి కథనం ప్రకారం దీని వెనుక వున్న ప్రసిద్ధ రచయత( ఆమె పేరు బాహాటం గా చెప్పకపోయినా ) ఎవరో ( యండమూరి వీరేంద్రనాథ్ అని వినికిడి) అందరికీ తెలుసు.

” ఎనకు తమిళం తెరియాదు...కన్నడ కురియాదు ( కన్నడం రాదు కాబట్టి ఏదో ప్రాస కోసం వాడాను.} కాబట్టి నేను చదివి చెప్పలేను. ఎవరైనా తమిళ తంబి లు...( సోదరీమణులను ఏమంటారబ్బా తమిళం లో.?)చెప్పాల్సిందే..అది నిజమైతే...అదే...నిజమైతే....హా..హతవిధీ...

ఇది కాక తాజా గా ఈ ఇతివృత్తం అలియాస్ కథాంశం చోరీల వివాదం లో చిక్కుకున్న ఖదీర్ బాబు, గోపిని కరుణాకర్ ల విషయం లో కూడా ఆరోపణలే తప్ప...నిజానిజాలు..ఎనకు తెరియాదప్పా....

ఇప్పుడు మళ్ళీ పాపం రావూరీ భరద్వాజ గారి దగ్గ్రకు వస్తాను....

నిన్న కారు లో వెళ్ళేటప్పుడు ” ఏంటీ మాలతి గారి దగ్గ్రర విశేషాలు? ఈ మధ్య నువ్వు బొత్తి గా ఆమె తో మాట్లాడినట్లు లేవు? అని ..పతి దేవుడు ఎంతో ప్రేమతో మాలతి గారి గురించి అడిగాడు...
నాకు టక్కున శారద గారి కామెంట్ గుర్తొచ్చి....కాదంబరి వెర్సస్ స్వార్ధ పరుడు మీద ఆవేశం గా లెక్చర్ ఇచ్చేశాను...పాపం ఆ మానవుడు డ్రైవ్ చేస్తూ కూడా నా ప్రసంగానికి తట్టుకున్నాడు..నా ఆవేశం చల్లారాక...అతి నిదానం గా నా నోరు మూయించాడు....
అఫ్సర్ చెప్పిన విషయాలు ఏమిటంటే....ఆహా. ఆ విషయం అంత తొందరగా చెప్పేస్తే ఎలా...సహనం స్త్రీలకే కాదండీ ....పాఠకులకు కూడా వుండాలి...( ఇది నా కొత్త స్లోగన్)

( ఇంకో టపా కోసం ఎదురుచూడండి...చూస్తూనే వుండండి....)

నోట్: బాబూ, ఈ పోస్ట్ లో చాలా చోట్ల స్మైలీ లు పెట్టాలని ప్రయత్నించి విఫలమైనాను. అర్థం చేసుకోండి.

Sunday, September 12, 2010

వానలో వసంతం !




కనురెప్పల కింద
వొద్దికగా వొదిగి వొదిగి
రెక్క విప్పుకుంటున్న కలలకు
కాపలా కాస్తున్న కళ్ళ చెట్లు

హృదయం లోపల ప్రేమ మొగ్గలకు
మాటలు రాకుండా అడ్డుపడుతున్న పెదాల పువ్వులు

యే స్వేచ్ఛా తీరాల కోసమో
పరుగెత్తాలనుకునే అంటు మొక్కల పాదాలకు
ఎటు చూసినా అడ్డు గోడలే!



ప్రేమలో పడ్డ ప్రకృతి తనువుకి
పదహారేళ్ళ ప్రాయం వసంతం
***
చెప్పా పెట్టకుండా వచ్చేసి చుట్టుకునే ప్రేమలా
ఆకాశం చూరు నుండి హోరున వర్షం

ప్రేమికుల రహస్య సంభాషణల్లా
గాలి గుసగుసలు

వాన కౌగిలింతతో
తడిసి ముద్దయిన కిటికీ రెక్క

ఎప్పటి విరహ వేదనో
ఈ వసంతపు వాన!

కల్పనారెంటాల

(మార్చి 20, 2010 టెక్సాస్ లో తెల్లవారుఝామున భారీ వర్షంతో స్ప్రింగ్ సీజన్ మొదలైనప్పుడు ఆ వసంతపు తొలి వానని స్వాగతిస్తూ రాసుకున్న కవిత సెప్టెంబర్ 13 ఆంధ్రజ్యోతి వివిధ లో ప్రచురితం. వసంతాన్ని ఆలింగనం చేసుకుంటూ రాసిన ఈ కవిత ఆకురాలు కాలాన్ని ఆహ్వానిస్తూ అచ్చయింది. ఈ కవిత కు మంచి చిత్రాన్ని గీసిన చిత్రకారుడు అక్బర్ కి ధన్యవాదాలు)
 
Real Time Web Analytics