నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది...కన్నుల్లో నీరు తుడిచి కమ్మటి కల ఇచ్చింది..

Friday, April 23, 2010

తొలి పుస్తకపు ప్రణయాలు- కొన్ని స్మృతులు!



అక్షరం పరః బ్రహ్మ స్వరూపం
పుస్తకం పరమౌషధం

కొందరి జీవితాలు పుస్తకాల చుటూ తిరుగుతుంటాయి. అందులో నాది కూడా ఒకటనుకుంటాను. ఆ మాటకొస్తే చాలా మంది జీవితాలు తెరిచిన పుస్తకాల్లాంటివి. అయితే ఒక్కోసారి ఆ పుస్తకం లోని పేజీల్లో అక్షరాలు మాయమైపొతాయి మంత్రజాలం లాగా. కొన్ని పేజీలు చిరిగిపోతాయి. మరికొన్ని నలిగిపోతాయి. కొన్ని కావాలని ఎవరో ఒకరు బలవంతంగా చింపేస్తారు. అంత మాత్రాన అది పుస్తకం కాకపోతుందా? మనది జీవితం కాకుండా పోతుందా?

అయిదేళ్ళకే విష్వక్సేనుడు శుధ్ధంగా పలకటం వచ్చేసిన తర్వాత పెద్దబాలశిక్ష ముందు వేసుకొని అలా అక్షరాల్ని గుర్తు పట్టుకుంటూ , చదువుకుంటూ వెళ్ళిపోవటం.అలా మొదలైంది నా సారస్వత ప్రయాణం.తెలియని అంటే చదవటానికో , పలకటానికో కష్టం గా వున్న పదాల్ని ఒకసారి అడిగి చెప్పించుకున్న తర్వాత ఇక మళ్ళీ అడగటానికి వీల్లేదు.. గుర్తు పెట్టుకు తీరాల్సిందే. తెలుగు మాట్లాడటము, చదవటం విషయంలో మాత్రం మానాన్నగారు నిరంకుశం గానే వ్యవహరించారని ఇప్పుడు అనిపిస్తోంది. ఇప్పుడు ఈ నాలుగు మాటలైనా రాయగలుగుతున్నానంటే అది ఆదిగురువైన మా నాన్నగారు పెట్టిన భిక్షే.

ఏడేళ్ళకే భగవద్గీత చదివి స్థితప్రజ్ఞుడు అంటే ఓస్! ఇంతేనా, ఇంత తేలికగా అంతా అర్ధమైపొతుంటే గీత చాల కష్టం, అర్ధంకాదు అంటారేమిటి? అని నాకు నేనే అనేసుకొని మా నాన్నగారికి అప్పుడే చెప్పేసాను. నేను పెద్దయ్యాక గొప్పదాన్ని తప్పక అవుతానని. దానికి నేను చెప్పిన వివరణ ఏమిటంటే పెద్దవాళ్ళకు కూడా అర్ధం కాని , కొరుకుడు పడని స్థితప్రజ్ఞత్వం నాకు అర్ధమైపోవటం వల్ల నేను ఖచ్చితంగా గొప్పదాన్ని అయిపోతానని నాకు గాఢ నమ్మకం. మా నాన్నగారు ఎందుకు ముసిముసిగా నవ్వుకున్నారో అప్పుడు తెలియకపోయినా ఇప్పుడు తెలిసింది ఆ నవ్వు వెనుక వున్నదేమిటో!ఆ పదానికి నిర్వచనం తెలియటం కాదు,అది ఆచరించి చూపిన నాడు అది నిజంగా అర్ధమైనట్టు అని ఇప్పుడు కదా తెలిసింది. అయితేనేమి అలా నా మీద నాకొక ఆత్మవిశ్వాసం కలిగించి నా వూహలకు రెక్కలు తొడిగించాయి భగవద్గీత లాంటి పుస్తకాలు. ఇప్పుడొకొక్కసారి ఆ పసితనపు ఆత్మవిశ్వాసం ఎక్కడ దాక్కుందా అని వెతుక్కుంటుంటాను.
తెలుగు నవలా సాహిత్యంలో నేను మొదట చదివిన పుస్తకం ద్వివేదుల విశాలాక్షి గారి 'గోమతి నవల. ఆ నవలలో కధానాయిక గోమతి పడే కష్టాలు, బాధలు చూసి అలా ఎందుకు బతకాలి,గట్టిగా ఎదురుమాట్లాడి తనకెలా కావాలో అలా వుండచ్చు కదా అని బోలెడంత ఆవేశం తెచ్చుకొని మా నాన్నగారితో వాదనేసుకున్నాను. అప్పుడు మా నాన్నగారు నా ప్రశ్నలకు సమాధానం చెప్పకపోగా తెలివిగా ఇంకేవొ విషయాలు చెప్పారు అచ్చమైన ఆడపిల్ల తండ్రిలాగా. ఆ రచయత్రి కధనాయికకు గోమతి అని ఎందుకు పేరు పెట్టిందో చెప్పారు. ఆ వివరణ అప్పట్లోనే అంత చికాకు తెప్పించిందంటే ఇప్పుడిక చెప్పక్కరలేదు. అదేమిటంటే గోమతి అనేది నది పేరు. నదుల పేర్లు ఆడపిల్లలకు పెట్టకూడదని, ఎందుకంటే ఆ నదుల జీవితాల్లాగే వాళ్ళ జీవితాలు కూడా దుఃఖభాజితాలవుతాయని. పాపం పిచ్చి నాన్న,ఈ ప్రపంచంలో నదుల పేర్లు పెట్టుకోని ఆడపిల్లల జీవితాలు కూడా లాటరి టికెట్ల లాంటివని ఆయనకు తెలియలేదు.
అలా నాకు అయిదేళ్ళ వయస్సు నుంచి ఒక్కో అక్షరాన్ని, ఒక్కో పదాన్ని, ఒక్కో పదానికి అర్ధాన్ని కూడబలుక్కుంటూ క్రమంక్రమంగా అర్ధం చేసుకుంటూ, అబ్బురపడిపోతూ, కళ్ళనీళ్ళు పెట్టుకుంటూ, పగలబడి నవ్వుకుంటూ, భక్తితో కళ్ళకద్దుకుంటూ, నవరసభావాలతో, నవవిధ భక్తి భావనలతో మొదలెట్టిన చదువు ఇంకా పూర్తి కాలేదు. తల్లీ నిన్ను దలంచి అంటూ చెప్పుకున్న పద్యాలు, గురుః బ్రహ్మ,గురుః విష్ణు అంటూ చెప్పుకున్న శ్లోకాలు అన్ని నరనరాన, అణువణువునా నిండిపోయాక, ఇప్పటికీ కాళ్ళకు ఏ పుస్తకమో, ఒక చిన్న కాగితముక్కో తగిలితే బాబోయి చదువు రాదేమో అన్న భయమే మొదట నా మనసులో మెదిలేది.

మా ఇల్లొక అక్షర దేవాలయము. అక్కడ దొరకని పుస్తకం లేదు. మా నాన్నగారు మాకు వివరించి చెప్పలేని కఠినమైన విషయం లేదు. ప్రాచీన, ఆధునిక సాహిత్యాలకు మా నాన్నగారొక వారధిలాగా కనిపించేవారు.భారతం, భాగవతం, రామాయణం, పంచ మహాకావ్యాలతో పాటు శరత్ సాహిత్యం, నవలలు, కధలు, అభ్యుదయ కవితాలు, రష్యన్ సాహిత్యపు అనువాదాలు అన్నీ మా సొంత లైబ్రరి లో వుండేవి. అందుకే మాకు వ్యాసుడు, వాల్మీకి తో పాటు టాల్ స్టాయి, దోస్తోవిస్కీ, అలెగ్జాండర్ కుప్రిన్ కూడా అంత బాగా తెలుసు. ఒక పక్క భారతం, మరో పక్క యుధ్ధం-శాంతి చదివిన తర్వాత ఇక జీవితంలో యెటువంటి పరిస్థితుల్లో కూడా యే దేశమైనా,ఏ దేశప్రజలపైనైనా యుధ్ధం చెయ్యటం ఎంత తెలివితక్కువ పనో అప్పుడే బలంగా నాటుకుపోయింది. ఇలా ఒక్కో పుస్తకం నుండి ఒక్కో పాఠం నేర్చుకున్నాను.
అనుబంధాలు, ఆకలి, మరణం --ఇవన్నీ కలిసి ఒక సమగ్రజీవితమనిపిస్తాయి. నన్ను బాగా కదిలించిన పుస్తకాలు అన్నా కెరినినా, మృత్యు ముఖంలో తుదిరోజు (సుప్రసిధ్ధ ఫ్రెంచ్ రచయత విక్టర్ హ్యుగో రచన ' ది కండెమ్నడ్ ' కి తెలుగు అనువాదం), ఆకలి((నోబెల్ బహుమతి గ్రహీత నట్ హాంసన్ రచన ' హంగర్ ' కి తెలుగు అనువాదము). .జీవితంలో ఒక క్లిష్ట పరిస్థితో, మనసుకి ఒక దుఃఖపు తెరో తాకినప్పుదు వెంటనే మనసు జ్ఞాపకపు పొరల నుంచి ఏదో ఒక పుస్తకాన్ని గుర్తు చేస్తుంది. అది తీసుకొని చదివాక, దాని నుండి ఏదో ఒక గొప్ప బలం వచ్చేది. ఆ కష్టాన్ని ఎదుర్కొనే శక్తి దొరికినట్టనిపించేది. 1995 లో అలా ఒక మానసిక సంఘర్షణని తట్టుకునే శక్తి నాకు ' అన్నా కెరినినా ' ఇచ్చింది. ఇక కళాపూర్ణోదయం, మాళవికాగ్నిమిత్రం,క్రీడాభిరామం చదివినప్పటి అనుభూతులు అందరికి పైకి చెప్పేవి కావు పదిలంగా పుస్తకంలో నెమలీకల్లా దాచుకోవాల్సినవే. ఇలా చెప్పుకుంటూ పోతే జీవితంలో ఒక్కో దశలో ఒక్కో పుస్తకం నిజమైన స్నేహితునిలా ఓదార్చేది. అమ్మలా ఆదరించేది. రహస్య ప్రణయంలా కొన్ని తీపి కలలనిచ్చేవి.
అందుకే నాశనం లేని అక్షరానికి, ఆదిగురువైన కన్న తండ్రికి అంజలి ఘటిస్తూ.....

కల్పనారెంటాల

Saturday, April 10, 2010

మా ఇంటి జ్ఞాపకాల భరిణ మూత తీసి చూస్తే.....!



ఏప్రిల్ 1, 2010: కొత్త ఇంట్లోకి మారాము.

ఇల్లు మారటం గురించి బాల్యం నుంచి ఎన్నో జ్ఞాపకాల పుటలు / వూహల ఉయ్యాలలు.

చిన్నప్పటి నుంచి ఇల్లు మారటం అంటే ఎంతో ఇష్టంగా వుండేది. ఎందుకంటే నేను పుట్టినప్పటి నుంచి 30 ఏళ్ళు ఒకే ఇంట్లో వున్నాను. ఆ ఇల్లు అంటే ఎంతో ఇష్టం. ఎన్నో తీపి గురుతులు. అయినా కొత్త ఇంటికి మారటం, ఆ ఇంటిని మనకు కావాల్సిన పద్ధతి లో సర్దుకోవటం అక్కడ కొత్త జీవితం మొదలుపెట్టడం ఇలాంటి మధురమైన వూహాలు ఏ పసితనంలో, యే యవ్వన వనం లో వుండవు?


సత్యనారాయణ పురం రైల్వే గేటుకి ఆనుకొని వున్న ఓ సందులో చివరాఖరున వున్న ఇళ్ళల్లో మాది ఒకటి. మా ఇంటి పక్కన ఓ ఇల్లు. ఆ ఇంటి తర్వాత రైలు పట్టాలు. పాతిక అడుగుల దూరం లో సత్యనారాయణ పురం రైల్వే స్టేషన్. మా అమ్మా, నాన్నగారు పెళ్ళి అయ్యాక ఆ ఇంట్లోకి వచ్చారు. మా అన్నయ్య దగ్గర నుంచి ఆఖర్ణ తమ్ముడు వరకూ ఆరుగురం ఆ ఇంట్లోనే పుట్టాము. మేము ఆ ఇంట్లో వున్నప్పుడు పుట్టడం కాదు. ఆ ఇంట్లోనే పుట్టాము. మా అమ్మ అన్నీ పురుడ్లు ఇంటి దగ్గరే పోసుకుంది. ప్రసవం నొప్పులు వచ్చేవరకూ అన్నీ పనులు తానే చేసుకునేదట. నొప్పులు వస్తుంటే నర్స్ కి కబురు పెట్టి వేడి నీళ్ళు, బట్టలు కూడా సిధ్ధం చేసుకొని రెడీ గా వుండేదట. ఆ విషయాలు మా అమ్మతో ఎన్ని సార్లు చెప్పించుకున్నా ప్రతి సారీ కళ్ళ నీళ్ళు వస్తాయి. ఇంకా నొప్పులు మొదలు కాకుండానే బెంబేలెత్తిపోయి సిజేరియన్ చేసేయమని అడిగే తల్లులు, కూతుర్లు, డబ్బులు ఎక్కువ వస్తాయని అవసరం లేకపోయినా ఆపరేషన్లు చేసే కొందరు డాక్టర్లు వున్న ఈ కాలం లో మా అమ్మ తరం స్త్రీలు నాకేప్పుడూ నమ్మలేని నిజాలుగా, అచ్చంగా నిలువెత్తు గాయలుగా కనిపిస్తుంటారు.


మా అందరి పెళ్ళిళ్లు, వాళ్ళకు పిల్లలు అన్నీ ఆ ఇంట్లో వుండగానే జరిగాయి. అయిదో, పదో రూపాయల అద్దెతో చేరిన మేము ఆ ఇంటి నుంచి ఇక తప్పనిసరై దాదాపు ఓ పదేళ్ళ క్రితం ఖాళీ చేసాము. ఇంతా చేసి అదేమీ పది గదుల బంగళా కాదు. ముచ్చటగా మూడు ఏక వరుస గదులు. వెనక ఓ పెద్ద బావి. దాని చుట్టూ ఒక చప్టా. దానికి ముందు నిత్యం ఉదయ, సాయంత్రాలు దీపారాధనతో వెలిగిపోయే తులసి కోట. గదుల కంటే పెద్ద గా వుండే పెరడు. అందులో కొబ్బరి, అరటి, కాకర, బూడిదాగుమ్మడి, సొర పాదులు. ఆ పక్కనే ఒక రెండు బాత్ రూమ్ లు. ఇదీ మా రాజ సౌధం. ఇల్లు ఎంత ఇరుకుగా వుండేదో నేను ప్రత్యేకం గా చెప్పక్కరలేదు. కానీ మనసులు, ప్రేమలు ,అనుబంధాలు, ఆత్మీయతలు మా మధ్య విశాలంగానే వుండేవి.


స్కూల్లో కొత్త వూర్ల నుంచి వచ్చే స్నేహితులు, సందులో ఏవో కొన్ని ఇళ్ళల్లోకి ఎప్పటికప్పుడు వచ్చి చేరే కొత్త మనుష్యులు వాళ్లందరిని చూసి అబ్బా, మనకు కూడా ట్రాన్సఫర్ అయితే బాగుండు, ఏదైనా కొత్త ఇంట్లో చేరవచ్చు. సామానంతా తీసేసి ఈ ఇల్లు ఖాళీగా బోసిగా వుంటే ఎలా వుంటుందో చూడొచ్చు. కొత్త ఇల్లు ఇంకొంచెం పెద్దగా వుంటే, ఎవరికి వారికి విడిగా గదులు వుంటే, వాటిని మనకిష్టం వచ్చినట్లు సర్దుకోవచ్చు.కొత్త ఇంట్లో సరికొత్తగా జీవితం మొదలుపెట్టవచ్చు అనుకుంటూ రకరకాల రంగుల కలలు కనేదాన్ని.


మా నాన్నగారు నేను పుట్టక ముందు నుంచీ ఒకటే ఉద్యోగం లో వున్నారు. ఆ ఉద్యోగం మారేది లేదు. అందులో ట్రాన్స్ ఫర్లు లేవు. అయినా కూడా ఇల్లు మారవచ్చు. కానీ మా నాన్నగారికి ఎందుకనో ఆ ఇల్లు వదలటం ఇష్టం వుండేది కాదు. ఆయనకు తన సొంత వూరు, సొంత ఇల్లు పల్నాడు వదిలి రావటం ఎంత తీవ్రమైన వేదనో చివరి క్షణం వరకూ చెప్తూనే వున్నారు. ఇంక అద్దె ఇల్లు అయినా ఇదే మన ఇల్లు అనేవారు. సొంత ఇల్లు , సొంత వూరు, పొలాలు వదులుకోవటం అంత వేదనను కలిగిస్తుందని మా నాన్న ను చూసి తెలుసుకున్నా నాకు అప్పట్లో ఆయనవి అన్నీ పెద్దవాళ్ళ చాదస్తాలుగా అనిపించేవి . ఇల్లు మారితే ఏమవుతుంది? మన పాత ఇంటి జ్ఞాపకాల పెట్టెలు, బట్టలు, వస్తువులుమనతోనే వుంటాయి కదా, అది కోల్పోవటం ఎందుకవుతుంది అనుకునేదాన్ని. ఇల్లు , వూరు, దేశం, భాష మారటం లో వున్న ఇబ్బందులు స్వానుభవం లోకి వచ్చాక మానాన్న బాధ ఏమిటో తెలిసి వచ్చింది. కానీ అప్పటికే చాలా ఆలస్యమైందనుకుంటాను.


జీవితం లో ఒక వయస్సులో ఎప్పుడూ ట్రాన్సఫర్లు అవుతూ వుండేవాడిని పెళ్ళి చేసుకోవాలనుకున్న నా వూహ కు ఇప్పుడు నవ్వొస్తుంది. పెళ్ళి అంటే మరీ అంత చవక ఆలోచనలు అప్పట్లో వుండేవా అని.
సరే, బాల్యం నుంచి అలా ఇల్లు మారటం ఒక తీరని కోరికగా జీవితం లో ఒక దశ వరకూ మిగిలింది. 95 నుంచి నా మూవింగ్ టైం స్టార్ట్ అయింది. 97 దాకా ఏవో చిన్న చిన్న ఇళ్ళ మార్పులు. 97 లో హైదరాబాద్ కి నివాసం మార్పు. పెట్టెల నిండా పుస్తకాలు, కాగితాలు. ఏవో నామ్ కే వాస్తే లాగా కొన్ని బట్టలు, గిన్నెలు.


హైదరాబాద్ లో వున్నది రెండేళ్ళు. మారింది మూడు ఇళ్ళు. ఆ తర్వాత అనంతపురంకు మకాం మార్పు. అక్కడ వున్నది నాలుగేళ్ళు కానీ ఒకటే ఇంట్లో వున్నాము.అక్కడి నుంచి ఎవరో తన్నినట్లు అమెరికా వచ్చి పడ్డాము.మాడిసన్ లో వున్న నాలుగేళ్ళలో రెండు ఇళ్ళు . 2007 లో ఆస్టిన్ వచ్చాక ఈ మూడేళ్ళలో ఇది ముచ్చటగా మూడో ఇల్లు. ఈ దెబ్బతో అసలు ఇల్లు మారటం మీదున్న మోహం, వ్యామోహం మొత్తం వదిలిపోయాయి. మొహం మొత్తేసింది. పాకింగ్, ఆన్ పాకింగ్ లో బోలెడు మెలకువలు, ఎదురుదెబ్బలు, విసుగులు, నిట్టూర్పులు, చికాకులు.అనేక పాఠాలు నేర్చుకున్నాము. పుస్తకాలే జీవితం, ప్రాణం అనిపించినా ఇల్లు మారేటప్పుడు మాత్రం వాటి అసలు బరువు అర్ధమవుతుంది. గిన్నెలు, బట్టలు సునాయాసం గా , ఎలాంటి సంకోచాలు లేకుండా అవతల పారెయ్యగలం కానీ ఒక్క కాగితం ముక్క కూడా అబ్బా, దీనితో పనేముందిలే పడేద్దాము అనిపించదు. ప్రతి పేపర్ అదేదో పెద్ద పెన్నిధి లాగా, ఎప్పుడూ అవసరం వస్తుందో అన్నట్లు భుజం మీద పెద్ద మూటల్లాగా భేతాళుడిలా మోసుకు తిరగటం. కొత్త ఇంట్లోకి రాగానే ఏమైనా కానీ ఇక ఇల్లు మారకూడదు అనుకోవటం. ఏదో ఒక కారణం తో రెండేళ్ళకు మళ్ళీ పిల్లి పిల్లల్ని మోసుకు తిరుగుతున్నట్లు ఇంకో ఇంటికి మారటం ఆనవాయితీ గా వస్తోంది. ఆ ఆనవాయితీ ని బ్రేక్ చేయాలని మనం అనుకున్నంత మాత్రానా సరిపోతుందా? కాలం కలిసి రావద్దా?


ఇల్లు మారటం బాధనా ? సంతోషమా? అంటే ఇదీ అని చెప్పలేని ఒక అనుభూతి. పాత ఇల్లు వదిలిపెడుతున్నప్పుడు లోపల నుంచి తన్నుకొచ్చే ఫీలింగ్ ని ఇదీ అని నిర్వచించలేము. ఆ ఇంటికున్నవి కేవలం గోడలేనా? అందులో వున్నది ఇసుక, సిమెంటు, కొన్ని చెక్కలేనా? గడపలు, ద్వారబంధాలేనా? ఇన్నాళ్ళు మనం ఆ ఇంట్లో వున్నప్పుడు ఆ గోడలతో మనం చాలా మాట్లాడి వుంటాము. మన మాటలు ఆ ఇల్లు చెవి వొగ్గి చాలానే విని వుంటుంది. .మన రహస్యాలన్నీ దానికి తెలిసిపోయి వుంటాయి. మన ప్రణయ కలహాలు, తీపి కబుర్లు, చిలిపి అలకలు, పిల్లల అల్లరి. వాళ్ళ బాల్యపు మిఠాయి వుండలు ఎన్ని వుంటాయి ఒక్కో ఇంట్లో? మనం వచ్చేశాక, మరో జంట అందులోకి వస్తుంది. వాళ్ళ పిల్లలు కొత్త ఆశల నిచ్చెనలు వేసుకుంటారు. ఆ జంట చేయి చేయి పట్టుకొని ఎన్నో వూసులు ఆ గదుల్లో చెప్పుకుంటారు. మనం ఒకరి తర్వాత ఒకరం వస్తూ వుంటాము. వెళ్ళి పోతూ వుంటాము. ఇల్లొక రైల్వే స్టేషన్. కొన్ని అరైవల్స్, కొన్ని డిపార్చర్స్. అన్నీ తెలిసి కూడా ఏమీ తెలియనట్లు, మౌనం గా, నిశ్శబ్దం గా , మూగగా మనకు ఆహ్వానాలు, వీడ్కోలు పలుకుతూ ఆ నాలుగు గోడల గదులు మరో అయిదో గోడను మన అపరిచిత, అపరిష్కృత సంక్షోభాల్ని, సంభాషణల్ని భుజాల మీద మోస్తూ గోమటేశ్వరుడి లాగా నిలబడి వుంటాయి.


ఇప్పుడు వదిలి వచ్చిన ఇంటి వెనక ఓ పెద్ద అడివి లాంటిది వుంది. కాన్యన్ సీనరీ. పెద్ద పెద్ద చెట్లు, వాటి మీద వాలే రంగు రంగుల పక్షులు, వాటి కూతలు, రాత్రి కాగానే మా ఇంటికి ఆతిధ్యానికి విచ్చేసే రెండు నల్లగా భీకరం గా కనిపించే రకూన్ లు. అవన్నీ తిథి వార నక్షత్రాలు చూడకుండా మా ఇంటికి వచ్చేసే అతిథులు. రకూన్స్ నా అని కంగారు పడకండీ. మొదట మేము కూడా కొంచెం భయపడ్డాము కానీ. మంచి గా కనిపించి క్రూరం గా మసిలే మనుష్యుల కన్నా క్రూరంగా కనిపించినా మంచిగా మసీలేవీ ఆ రకూన్ లు. నేను బయట పెట్టిన బ్రెడ్, అన్నం, ఏదైనా సరే తినేసి ఇంకాస్త పెడతారా అన్నట్లు ఆ పేటియో తలుపు వెనకాల నుంచి చూస్తూ నిలబడేవి. వుయి మిస్ దెమ్.


ఇప్పుడు మారిన మా కొత్త ఇల్లు బావుంది. కానీ కాన్యన్ లేదు. ఒక చిన్న పేటియో. మన భాష లో పెరడు అనుకోండి. పెరట్లో ఓ మూలన పెద్ద కుంకుడుకాయ చెట్టు లాంటి చెట్టు. దానికి ఆకుల కన్నా కాయలే ఎక్కువేమో అనిపిస్తాయి. తెల్లవారేటప్పటికి పెరడంతా ఆకులు, కాయలు, పూల ధూళి అంతా ఆకుపచ్చగా పర్చుకొని వుంటుంది. ఆ చెట్టు మీద కూడా రకరకాల పక్షులు వాలతాయి. తెల్లారగట్ల ముందుకూ వెనక్కూ వూగే రాకింగ్ ఛైర్ లో కూర్చుంటే గతం లోకి, భవిష్యత్తు లోకి వెళ్ళి వస్తున్నట్లు వుంటుంది. అక్కడ కూర్చొని నా మొదటి కాఫీ తాగుతున్నప్పుడో, వంటింటిలో వంట చేస్తున్నప్పుడో ఆ పక్షులు, కొత్తగా ఆ చెట్టు కి తగిలించిన కొన్ని గాలిగంటల ( విండ్ చైమ్) శబ్దాలు ఏవేవో కబుర్లు చెప్తూ నన్ను పొద్దుపుచ్చుతాయి. ఆ గాలి గంటలతో నేస్తం చేసేందుకు మల్లె, మందార మొక్కల్ని కూడా తెచ్చిపెట్టాము. ఇవాళే ఒక మందారం పూసింది. గుండు మల్లె చెట్టు కి మొగ్గలున్నాయి. తొందర్లోనే మా పెరడంతా , నా మనసంతా మల్లెపూల గుబాళింపు పరిమళం. ఆ గాలి గంటల మృదు మధుర మంజీర నాదాల మధ్య మా పాత ఇంటిని పూర్తిగా మర్చిపోలేదు కానీ ఈ కొత్త ఇంటిని సరికొత్తగా ప్రేమించడం మొదలుపెట్టాను.


ఇల్లు మారటం అంటే ఉగాది పచ్చడి లా తీపి, చేదు, వగరు, పులుపు, కారం అనేక రుచుల సమ్మిళితం.


ఈ ఇళ్ళు మారటం లో నేను ఏం పొందాను అనే దానికన్నా ఎన్నెన్ని పోగొట్టుకున్నాను అన్నది మరో సారి....ఎప్పుడో...ఇంకో ఇల్లు మారటానికి ముందు.....

ఇంతే సంగతులు.
ఇట్లు
ఓ అద్దె ఇంటి అమ్మాయి






 
Real Time Web Analytics