నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది...కన్నుల్లో నీరు తుడిచి కమ్మటి కల ఇచ్చింది..

Sunday, March 28, 2010

“ సారంగ” ఈ దశాబ్ది కవితా సంకలనం –కవితలకు ఆహ్వానం


సారంగ బుక్స్
ఉత్తమ సాహిత్య ప్రచురణ సంస్థ

----------------------------------------------------------------

ఒక దశాబ్ది కవిత - కవితా సంకలనం 2000-2009


మంచి సాహిత్యాన్ని అచ్చులోకి, అందుబాటులోకి తీసుకురావాలన్న సంకల్పానికి రూపం "సారంగ బుక్స్". మా మొదటి ప్రచురణ 2000 నుంచి 2009 వరకీ వచ్చిన మంచి కవితల సంకలనం. ఈ సంకలనం జూలై మొదటి వారంలో వెలువడుతుంది.
రెండో మిలీనియం తెలుగు కవిత్వంలో కొత్త చేతనకి తలుపులు తీసింది. ఒక వైపు ప్రపంచీకరణ ప్రభావం సృజనాత్మకతని మింగేస్తున్న కాలంలోనే, మరో వైపు కొత్త అభివ్యక్తి గొంతు సవరించుకుంటోంది. ఈ మార్పుని ప్రతిఫలించే ఒక కవితా సంకలనం వెలువరించాలని మా సంకల్పం. ఈ సంకలనంలో 2000 నించీ 2009 వరకూ వివిధ రూపాల్లో - అంటే లిఖిత పత్రికల్లో గానీ, విడి సంకలనాల్లో గానీ, ఇంటర్నెట్లో గానీ - వెలువడిన కవితల్ని మేము ఆహ్వానిస్తున్నాం. ఒక్కొక్క కవి నించి మూడు అత్యుత్తమ కవితల్ని ఆహ్వానిస్తున్నాం. ఈ సంకలనానికి మీరు మీ కవితలతో పాటు మీకు నచ్చిన ఇతరుల కవితల్ని కూడా సూచించవచ్చు. మే ఒకటవ తేదీకల్లా కవితలు పంపండి.
మీ కవితలు ఈమెయిల్ ద్వారా afsartelugu@gmail.com కి పంపండి. మీరు ఈ కవితా సంకలనం కోసం పంపే ఈమెయిల్స్ లేదా ఉత్తరాల మీద "సారంగ బుక్స్" కోసం అని రాయండి.
సాధారణ తపాలా ద్వారా పంపే వారు:
వంశీ కృష్ణ
కేరాఫ్: లక్ష్మీ గణపతి ప్రింటింగ్ ప్రెస్
మండల్ ఆఫీస్ కాంప్లెక్స్, గంపలగూడెం - 521 403
కృష్ణా జిల్లా – (సెల్ నంబరు: 9491959062)- కి పంప వచ్చు.
--------------------------------------------------------------------------------------------

Saturday, March 20, 2010

నది –సప్తపది!


అగ్నిహోత్రం లా నది
చుట్టూ సప్తపది
***
ఒక ఒడ్డున నువ్వు
మరో తీరాన నేను
నది సాక్షిగా నిరీక్షణ
***
వెను తిరిగి వెళ్ళిపోతున్న నువ్వు
నా మీద నుంచి నడిచివెళుతున్న నది
***
నా నదీ దేహం లోకి
నడిచి వచ్చిన పడవ
ఎందుకు వచ్చిందో, ఎందుకు ఆగిందో—
పడవ చేసిన గాయంతో
సుళ్ళు తిరుగుతున్న నది
***
నా పాదాల్ని ముద్దిడుతున్న నది
నా కోసమే విచ్చిన మంచు పూలు
రెండు గట్లతో చెట్టాపట్టలేసుకొని
వచ్చిన వెన్నెల దీపం
జాలరి వలలో చిక్కిన రవి కిరణాలు
అన్నీ నా సొంతమనుకున్నా!
ఎంత పిచ్చిదాన్ని!
నడుస్తూ నడుస్తూ వుండగానే
ఆనకట్ట కౌగిలి లోంచి
ఎక్కడో కాలం జారీ పడిపోయింది
నే చూడనే లేదు!


కల్పనారెంటాల

(వార్త ఆదివారం అనుబంధం 8-3-1998)

Sunday, March 07, 2010

పార్వతి మూడో కన్ను!





అప్పటివరకూ అర్ధనారీశ్వరుల్లా తాండవమాడిన ఆదిదంపతులు అలసట తీర్చుకుంటుండగా నారదుడి రంగ ప్రవేశం. ముల్లోకాల్లోని విశేషాలను విశదం చేస్తూంటే ఏదో అడగబోయి "నాథా" అంటూ శివుణ్ణి నెమ్మదిగా పిలిచింది పార్వతీదేవి.

"మధ్యలో నీ గోలేమిటి? " అంటూ శివుడు విసుక్కోవడం తో ఆ క్షణం లో పార్వతి కి తామిద్దరం వేర్వేరు అన్న స్పృహ కలిగింది. తన అస్తిత్వమేమిటో తెలిసి వచ్చినట్లనిపించింది. ఏమిటీ ఈయన గారి గొప్ప? పక్కన శివుడు లేకపోతే నేనేక్కడికి వెళ్లలేనా? ఏం చేయలేనా? అనుకుంటూ నెమ్మదిగా అక్కడి నుంచి లేచి భూలోక సంచారానికి బయలుదేరింది.


అలా భూలోకం లో హైదరాబాద్ కి విచ్చేసిన పార్వతి కి నగరం లో ఇంటి పట్టున వుండే ఆడవాళ్ళు ఏం చేస్తుంటారో తెలుసుకోవాలనిపించింది. అదృశ్య రూపంతో బంజారా హిల్స్స్ లో వుండే ఓ ఇంట్లో దూరింది. ఎనిమిది చేతులతో, రెండే కాళ్ళతో ఓ స్త్రీ మూర్తి వంటింట్లోకి, హాల్లోకి, పిల్లల గదుల్లోకి పరుగులు తీస్తోంది. పార్వతి కళ్ళకు అదొక లయబద్ధమైన నృత్యం గా కనిపించింది. ఆ స్త్రీ కి రెండే కాళ్ళున్నా అన్నీ చేతులెందుకున్నాయో ఒక్క క్షణం తెలియకపోయినా ఓ అయిదు నిముషాలు ఆమె ఏం చేస్తోందో గమనించేటప్పటికి అన్ని చేతులు ఆమెకు ఎందుకు అవసరమో పార్వతిదేవి కి అర్ధమైపోయింది. టిఫిన్లు, వంట, కారియర్లు సర్దటం, బస్ స్టాప్ ల్లో పిల్లల్ని వదిలి రావడం, పతి దేవుడికి కావాల్సినవి సమకూర్చి పెడుతున్న ఆ స్త్రీ మూర్తి పట్ల పార్వతి కి చిన్నపాటి సానుభూతి కలిగింది. ఆమె నుదుట పట్టిన చెమటను సుతారంగా తన పమిట కొంగుతో అద్దింది. ఒక్క క్షణం ఆ స్పర్శ కు ఆ స్త్రీ మూర్తి కి అలసట అంతా పోయినట్లనిపించింది.


ఇంట్లో వున్న వాళ్ళందరూ బైటకెళ్ళిపోగానే పని మనిషికి గిన్నెలు, బట్టలు బైట పడేసి ఓ చెంబు నీళ్ళు గుమ్మరించుకొని దేముడి ముందు ఓ నమస్కారం పడేసి ఆమె కర్మ యోగం నుండి క్రియా యోగం లోకి ప్రవేశించింది. చేతులకు గ్లోవ్స్ , తలకు శిరస్త్రాణం ధరించి తన కైనెటిక్ యాక్టివ్ బయిటకు తీసి పరుగులు పెట్టించి ఓ యోగా సెంటర్ ముందు బండి ఆపి లోపలకు వెళ్ళింది. ప్రాణా యామం అయిదు నిముషాలు, ఆసనాలొక అరగంట చేసి చివరగా శవాసనం వేసింది. శవాసనం లో కనీసం పది నిముషాలైనా శరీరానికి విశ్రాంతి ఇవ్వాల్సి వున్నా చేయాల్సిన పనుల జాబితా గుర్తుకు వచ్చి దాన్ని రెండు నిముషాలకు కుదించి మళ్ళీ బైట పడింది.


ఆదిత్య ఎన్ క్లేవ్ లోకి వెళ్ళి పి.సి. కి కావాల్సిన ఎక్స్ టర్నల్ స్పీకర్లు, వెబ్ కామ్ కొనుక్కోని సోమాజి గూడా వైపు బండిని పరుగులు పెట్టించింది. కళానికేతన్ లోకి వెళ్ళి తనకొక రెండు మంచి చీరలు, అమ్మాయికి నాలుగు మంచి డ్రెస్సులు కొన్నది. వచ్చే నెలలో వున్న పెళ్ళిళ్ళు, పై వారం లో వున్న పార్టీల లిస్ట్ కళ్ళ ముందు కదలాడుతుంటే ఆ కొత్త బట్టల్ని తీసుకొని అటు నుంచి అటే టైలర్ దగ్గరకెళ్ళి పోయింది. అప్పుడు గుర్తోంచ్చింది ఈ సేవా సెంటర్ కెళ్ళాలని. అక్కడ ఫోన్ బిల్లు, కరెంటు బిల్లు కట్టేసింది. సెల్ ఫోన్ లో రీఛార్జ్ కార్డు వేయించుకుంటుంటే ఎల్ ఐ సి ప్రీమియమ్ సంగతి యాదిలోకొచ్చి ఆ పని కూడా పూర్తి చేసెసింది.


ఇంతలో సెల్ మోగింది. “ హాయ్ ! హానీ! హౌ ఆర్ యూ? ఎక్కడున్నావు? ఏముందిలే. ఇంట్లో హాయిగా టివి చూస్తూ ‘ అవాక్కయి ‘ పోయింటావు. నీకేం హౌస్ వైఫ్ వేగా? నీ టైం నీ చేతుల్లో వుంటుంది. నువ్వేం కావాలంటే అవి చేసుకోవచ్చు. టెన్షన్ లెస్ జాబ్ కదా” అంటూ దండకం చదివేశాడు పతిదేవుడు. సర్లే కానీ, విషయం చెప్పు, ఏం పని చేయాలి అని అడగగానే, “ కొంచెం ఆ ICICI బాంక్ లో మన హౌస్ లోన్ గురించి మాట్లాడకూడడూ! ఆ మేనేజర్ గాడికి ఆడవాళ్లంటే బోలెడు కన్సర్న్. నువ్వు అసలే మంచి ఫిజిక్ మైం టైన్ చేస్తున్నావుగా, మన లోన్ వెంటనే శాంక్షన్ అయిపోతుంది ‘ అంటూ ఓ కుళ్ళు జోక్ విసిరాడు అవతలివైపు నుంచి.


ఇలా అన్నీ పనులు చేసుకొని ఇంటికి చేరేసరికి సాయంత్రం నాలుగు కావచ్చింది. ఇంక లంచ్ ఏం చేస్తాంలే, స్కిప్ చేస్తే వొళ్ళు అయినా తగ్గుతుందనుకొని ఏవో నాలుగు స్నాక్స్ తిని ఓ కప్పు టీ తాగేసరికి పిల్లలు ఇంటికొచ్చేశారు. పిల్లలతో పేరెంట్స్ గా కాకుండా స్నేహితుల్లా మిలగాలని ‘ చిట్టక్క ‘ చెప్పిన సలహాలను తూ.చా. తప్పకుండా పాటించేందుకు ప్రయత్నం మొదలు పెట్టింది. పిల్లల హోమ్ వర్క్ లో సహాయం చేస్తూ, వాళ్ళ కిష్టమైనా టీవీ ప్రోగ్రామ్ లు వాళ్ళతో చూస్తూ డిన్నర్ చేసేటప్పటికీ రాత్రి పది ఎలా వచ్చేసిందో ఆమెకు తెలియలేదు.


అందరికీ గుడ్ నైట్లు చెప్పి పర్సనల్ డైరీ కం ప్లానర్ తీసుకొని పక్క మీద వాలింది. ఇవాళ చేయాలనుకున్న పనులు, చేసిన పనులు , చేయలేకపోయిన పనులు అన్నీ మార్క్ చేసుకుంది. నెక్ట్స్ వీక్ ఇంట్లో పార్టీకి కావాల్సినవి, చుట్టాలింట్లో పెళ్ళికి వేసుకోవాల్సిన డ్రెస్ లు, నగలు , ఫేషియల్ అపాయింట్ మెంట్ అన్నీ చెక్ చేసుకుంది. బెడ్ పక్కన టేబుల్ మీద తను ఎప్పటి నుండో చదవటం మొదలుపెట్టాలనుకొని తెచ్చుకున్న పుస్తకం “ ఇన్ హెరిటెన్స్ ఆఫ్ లాస్ “ ఆమెను చూసి నా సంగతేమిటని అడుగుతున్నట్లనిపించి గుడ్ నైట్ బుక్ అంటూ ఆమె నిద్ర లోకి జారుకుంది.


ఆ రోజంతా ఆమె ను నీడ లాగా ఫాలో అయిన పార్వతి దేవి కి ఆ దినచర్య అంతా చూసి వొళ్ళు జలదరించింది. ఇండియాలో హౌస్ వైఫ్ లాగా బతికే కంటే కైలాసం లో శివుడు చెప్పే కబుర్లు వింటూ తాండవం చేయడమే మేలనుకుంటూ తిరిగి పయనమైంది మన పార్వతీదేవి. తనకి కూడా వున్న మూడో కన్ను గురించి శివుడి కి తెలియకుండా దాచేసుకొని ఏమీ ఎరగనట్లు కైలాసం లొకి చిరునవ్వుతొ అడుగుపెట్టింది.

కల్పనారెంటాల
( నూరేళ్ళ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు )

Friday, March 05, 2010

తెలుగు డయాస్పోరా ఒక మూస ఘోష ?

డయాస్పోరా తెలుగు సాహిత్యం గురించి కొంచెం సీరియస్ గా చర్చించుకోవాలని, మాట్లాడుకోవాలని అనుకుంటున్న అనేక మంది లో నేను కూడా ఒకరిని. తెలుగు సాహిత్యం లో డయాస్పోరా సాహిత్యం ఒక పాయ గా మొదలైందని, ముందు ముందు దాన్ని కూడా కలుపుకొని తెలుగు సాహిత్యాన్ని సమగ్రం గా విశ్లేషించాల్సి వుంటుందని నా అభిప్రాయం. అందుకనే “ 20 వ శతాబ్దం లో అమెరికా తెలుగు కథానిక మరియు అమెరికా తెలుగు సాహితీవేత్తల పరిచయ గ్రంధం “ పుస్తకం వస్తోందని ఓ ఏడాది క్రితం అనుకుంటాను వంగూరి చిట్టెన్ రాజు గారు చెప్పగానే ఆసక్తి గా ఎదురుచూడటం మొదలు పెట్టాను. పుస్తకం చేతికి వచ్చింది కానీ 600 కంటే ఎక్కువ పేజీలున్న ఈ బృహత్ గ్రంధాన్ని ఇంకా చేతిలో పట్టుకొని చదివే సాహసం మాత్రం ఇంకా చేయలేదు.

ఆ సాహసం చేసి దాని మీద పెద్ద వ్యాసం కూడా రాసేశారు ఈమాట ప్రధాన సంపాదకులు వేలూరి వెంకటేశ్వరరావు.
ఈ పుస్తకం చదివి మాట్లాడటం ఉత్తమం. అయితే పుస్తకం చదవకపోయినా కూడా ఈ పుస్తకం పై వేలూరి వ్యాసాన్ని చదివి మాట్లాడుకోవచ్చు.

డయాస్పోరా తెలుగు సాహిత్యం గురించి మొదటి నుంచి సీరియస్ గా మాట్లాడుతున్న వారిలో ప్రధములు వేలూరి. డయాస్పోరా తెలుగు సాహిత్యాన్ని గురించి మాట్లాడటమే కాకుండా సీరియస్ గా ప్రచురణలు కూడా మొదలుపెట్టిన వ్యక్తి వంగూరి చిట్టెన్ రాజు. ఇప్పుడు ఈ పుస్తకం ప్రచురించినది చిట్టెన్ రాజు . వ్యాసం రాసింది వేలూరి. ఆ రకంగా ఇద్దరు ఉద్దండులకు సంబంధించిన అంశం ఇది.

డయాస్పోరా సాహిత్యం గురించి వేలూరి చాలా చోట్ల ప్రసంగాల్లోనూ, వ్యాసాల్లోనూ చెప్పిన విషయాల్ని మరింత వివరంగా సమగ్రం గా ఈ వ్యాసం లో మరో సారి చెప్పారు.. దానికి సందర్భం 20 వ శతాబ్దం లో తెలుగు కథానిక పై ఆయన చేసిన సమీక్ష అనుకోండి. విశ్లేషణ అనుకోండి, లేదా ఆ పుస్తకం చదివాక ఆయనకు కలిగిన అభిప్రాయాలు అనుకోండి. అది ఈ వ్యాసం. పుస్తకం లో వున్న అక్షరదోషాలు, జనరల్ గా అమెరికా తెలుగు కథల్లో లోపించిన నాణ్యతా మొదలైన విషయాల్ని కూడా వ్యాసంలో ప్రస్తావించారు. పుస్తకం లో వున్న కథల మీద మాత్రం సమీక్ష లేదు. అసలు ఈ 40 ఏళ్ళల్లో మంచి కథలు రాలేదా? లేక ఈ సంపాదకులు ఎంచుకున్న కథలు అలా నాసిరకంగా వున్నాయా అన్నది స్పష్టం గా చెప్పి వుండాల్సింది. ఈ సంకలనం లో వున్న కథల్లో అసలైన డయాస్పోరా కథ ( వేలూరి గారు, జంపాల గారి ప్రమాణాల మేరకు) ఒక్కటి కూడా లేదా? వుంటే ఆ కథ మిగతా వాటికంటే ఏ రకంగా భిన్నమైంది? అనేది చర్చించి వుంటే ఒక సమగ్రత వచ్చేది. అసలు ఒక్క డయాస్పోరా కథ కూడా లేకపోతే ఆ సంగతినే స్పష్టం గా చెప్పాల్సింది. డయాస్పోరా సాహిత్యం మీద వేలూరి తన అభిప్రాయాల్ని మొదట ఒక వ్యాసం గా రాసి, రెండో భాగం ఈ పుస్తకం మీద సమగ్ర విశ్లేషణ చేస్తే సముచితం గా వుండేది. సమీక్షిస్తున్న పుస్తకం లోని విషయాల కంటే, డయాస్పోరా కి సంబంధించిన ఇతర విషయాలతో నిండి వుండి ఈ వ్యాసం మొత్తం.

““అమెరికా నుంచి వచ్చిన ప్రతి రచనా డయాస్పోరా రచనగా భావించడం గాని మొదలయ్యిందా? లేదా, డయాస్పోరా రచన అంటే నాకున్న అభిప్రాయాలు తప్పుడు అభిప్రాయాలా?” అని. వేలూరి అడిగారు. అలాగే “ఈ సంకలనంలో అధ్యక్షుల ముందుమాటలో “డయస్పోరా ఇతివృత్తాలకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాం,” అన్నమాటలు చూసిన తరువాత, ఈ డయాస్పోరా అనే ‘వింత పదం’ ఊత పదంగా తయారయ్యిందా అన్న అనుమానం వస్తుంది. “ అన్నారు వేలూరి. ఆయన లేవనెత్తిన ఈ రెండు కూడా ముఖ్యమైన విషయాలు. దాని మీద ఎంత సమగ్రమైన విశ్లేషణ జరిగితే అంత మంచిది. ఈ సంకలనాన్ని పై పైన చూసినప్పుడు నాకు అదే ఆలోచన కలిగింది. ఎందుకంటే వంగూరి వారి కథా సంకలనానికి పెట్టుకున్న టైం పీరియడ్ 1964-2000. ఆ టైమ్ లో రచయితలు ఏం కథ రాస్తే దాన్నే ఈ సంకలనం లో చేర్చినట్లు కనిపించింది. ఆ రకంగా ఆ టైమ్ పీరియడ్ లో వాళ్ళు మామూలు కథ ( అమెరికాకు సంబంధించిన ఇతివృత్తం కాకపోయినా ) రాసినా ఇందులో చేర్చి వుండాలి.

వేలూరి తన వ్యాసం లో అమెరికా లో వచ్చే తెలుగు కథల ఇతివృత్తాల గురించి సోదాహరణం గా పేర్కొన్నారు. కుటుంబం లో విషయాలు, భార్యాభర్తల గొడవలు,పిల్లల పెళ్ళిళ్ళు , నోస్తాల్జియా, ఇవేమీ డయాస్పోరా కాకపోతే ఇక ఏది డయాస్పోరా? సింగపూర్ చైనా వారి డయాస్పోరా సాహిత్యం లో వున్న ఇత్రివృత్తాలు , అనుభవాలు ఏవేమిటి? అవి ఏ రకంగా తెలుగు సాహిత్యానికంటే విభిన్నమైనవి, ఉత్తమమైనవి అని వేలూరి గారు అనుకుంటున్నారో అది చెపితే ఈ వ్యాసానికి ప్రత్యేక ప్రయోజనం వుండేది.

వంగూరి వారు ఈ పుస్తకం లో ఇచ్చిన వివరాల ప్రకారం అమెరికాలో 1964 లో తెలుగు వారి కలం నుండి మొదట కథ వెలువడింది. అమెరికా తెలుగు వారి సాహిత్య కృషి 1970 నుంచి ప్రారంభమైనట్లు వివరాలిచ్చారు ఈ పుస్తకం లో. అంటే అమెరికా తెలుగు సాహిత్యం వయస్సు ఇంకా నలభై ఏళ్లు కూడా లేదు. ఈమాట సాహిత్య కృషి వయస్సు ఓ 12 ఏళ్లు. చిట్టెన్ రాజు గారి ప్రచురణాల సంస్థ వయస్సు 15 ఏళ్లు. దీన్ని బట్టి కూడా డయాస్పోరా తెలుగు సాహిత్యం , రచయితలు ఇంకా శైశవ దశ లోనే వున్నారని అర్ధం చేసుకోవచ్చు. అమెరికా లో తెలుగురచయితలు ఎవరు? వారి రచనలు ఏమిటి? ఎవరెవరు ఎలాంటి రచనలు చేస్తున్నారు, అనేది సరిగ్గా అర్ధం చేసుకుంటే తప్ప మనకు డయాస్పోరా సాహిత్యం ముందు ముందు ఎదుగుతుందా, లేక ఇలాగే వుంటుందా అనేది కూడా తెలియదు.

ఈ సంకలనం లోని కథల నాణ్యత గురించి మాట్లాదేముందు అసలు ఇంత మెటీరీయల్ ఒక చోట దొరకడం ఒక మంచి విషయం గా మనం గుర్తించాల్సి వుంది.

వేలూరి వ్యాసం ఈ నెల ఈమాట లో వచ్చింది. దానిని ఇక్కడ చదవండి.
తెలుగు డయాస్పోరా సాహిత్యం పై ఆసక్తి వున్న వారు నేను రాసిన వ్యాసం ఇక్కడ , సావిత్రిమాచిరాజు వ్యాసం ఇక్కడ , అఫ్సర్ రాసిన వ్యాసం ఇక్కడ చదవవచ్చు.

కల్పనారెంటాల
 
Real Time Web Analytics